భాజపా, కాంగ్రెస్ పార్టీలకు లేని నెట్వర్క్ తమకుందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవి తరఫున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరయ్యారు.
కష్టపడి పని చేస్తే గెలుపు ఖాయమని అభ్యర్థులకు, కార్యకర్తలకు సూచించారు. ఓటరును నేరుగా కలిసి తెరాసకు ఎందుకు ఓటు వేయాలో వివరించాలని దిశానిర్దేశం చేశారు. భాజపా అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటికి తాగు నీరు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రైతు బంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని ఆరోపించారు. రాష్ట్రం వచ్చేనాటికి విద్యుత్ 7,778 మెగా వాట్లు కాగా... నేడు 16 వేల మెగా వాట్లకు చేరిందని అన్నారు.