Gangula Kamalakar Respond On ED and IT Raids: తమ గ్రానెట్ సంస్థలపై ఈడీ, ఐటీ జరిపిన సోదాలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. దర్యాప్తు సంపూర్ణంగా నిర్వహించి.. నిజా నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనని చెప్పారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వీడియో కాల్ చేసి ఇంటి తాళాలు తీయమని అడిగారని పేర్కొన్నారు. ఇంట్లోని ప్రతీ లాకర్‌ను తెరచి చూసుకోమని చెప్పానని గంగుల అన్నారు.
ఈ సోదాల్లో ఏంత నగదు దొరికిందో.. ఏమేమి స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు తెలపాలని గంగుల కమలాకర్ కోరారు. మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని చెప్పారు. బయట దేశాల నుంచి నగదును హవాలా రూపంలో తెచ్చామా అనేది ఈడీ చూస్తోందని పేర్కొన్నారు. ఎక్కడైనా డబ్బును అక్రమంగా నిల్వ ఉంచామా అనేది ఐటీ చూస్తోందని గంగుల తెలిపారు.
ఈ రెండింటికి సంబంధించినవి తమ సంస్థల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గతంలో సైతం చాలా సార్లు, చాలా మంది.. ఈడీ, ఐటీ సంస్థలకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. తాము పారదర్శకంగా, ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ సమయంలో దగ్గరుండి దర్యాప్తుకు సహకరించాలని.. వెంటనే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చానని గంగుల కమలాకర్ వివరించారు .
ఈరోజు జరిగిన ఐటీ, ఈడీ సోదాలు రాజకీయ కోణంలో జరగలేదని అనుకుంటున్నానని గంగుల కమలాకర్ చెప్పారు. ఎందుకంటే ఈ దాడుల్లో భాజపాకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు. మరోవైపు గవర్నర్‌తో తమకు విబేధాలు లేవని స్పష్టం చేశారు. గవర్నర్ గురించి ఆలోచన చేసే సమయం కూడా తమకు లేదని గంగుల కమలాకర్ వెల్లడించారు.
"దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి సహకరిస్తాం. ఎక్కడా తప్పు జరగలేదు. దర్యాప్తు సంస్థలు ఏదీ అడిగినా అందుకు సమాచారాన్ని అందిస్తాం. మా గ్రానైట్ సంస్థలు సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం."-గంగుల కమలాకర్ మంత్రి