Masab Pond Occupy In Turkanyala Municipality: రాష్ట్రంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. అక్రమార్కులు, భూబకాసురులు అక్కడ వాలిపోతున్నారు. ఈ మధ్య కాలంలో చెరువులను కూడా కబ్జా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధి తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మాసబ్ చెరువును ఓ రియాల్టర్ కబ్జా చేశాడు. ఎఫ్ టి .ఎల్ పరిధిలో ఉన్న ఆ చెరువును.. రాత్రి సమయంలో గుట్టుచప్పుడుగా టిప్పర్లతో మట్టిని చెరువులో డంపు చేశాడు. ఇంత చేస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో చారిత్రాత్మక చెరువుగా ప్రసిద్ధి చెంది.. తుర్కయంజాల్కు తలమానికమైన మాసబ్ చెరువు 320 ఎకరాల్లో విస్తీర్ణం విస్తరించి ఉంది. అయితే ఈ చెరువుకు అనుకొని ఉన్న 205 సర్వే నంబర్లో కోట్ల రూపాయలు విలువ చేసే 12 ఎకరాల భూమి ఉందని స్థానికులు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా మాసబ్ చెరువు నిండా నీరు ఉండడంతో కబ్జాదారులు వెనకడుగు వేస్తూ వచ్చారని.. ఇప్పుడు నీరు తగ్గుముఖం పట్టడంతో కబ్జాకు వీలైందని వారు పేర్కొన్నారు.
గత 15 రోజుల నుంచి ఎఫ్.టీ.ఎల్ ప్రాంతాన్ని ఆక్రమించే పనిలో భాగంగా రాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున మట్టిని డంపు చేసేవారని చెప్పారు. ఈ చెరువు సుందరీకరణకు మంత్రి కేటీఆర్ గతంలో రూ.2కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారన్నారు. చెరువు అభివృద్ధికి కూడా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని వివరించారు.