ED On Manchireddy Kishan Reddy: నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని హైదరాబాద్ ఈడీ అధికారులు వరుసగా రెండో రోజు కూడా విచారించారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయనను రాత్రి 8 గంటల వరకు అధికారులు అనేక అంశాలపై ప్రశ్నించారు.
బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఈడీ అధికారులకు వివరించినట్టు సమాచారం. దాదాపు 10గంటల పాటు విచారించిన అనంతరం ఈడీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఈడీ అధికారులు నిరాకరిస్తున్నారు నిన్న కూడా ఈడీ కార్యాలయానికి వచ్చిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని 9గంటలపాటు ఈడీ అధికారులు అనేక అంశాలపై ప్రశ్నించారు. ఒకపక్క దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ అధికారులు వరుసపెట్టి సోదాలు నిర్వహిస్తుండగా తాజాగా రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేని ఈడీ విచారించడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంపై మాట్లాడేందుకు ఈడీ అధికారులు నిరాకరిస్తున్నారు. కేసు నమోదు కాలేదని, ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే ఆయనను మౌఖికంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇందులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా అవసరమైతే ఈడీ అదికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు.