Bomb Threat Call to Shamshabad International Airport: ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకునేందుకు ఉద్దేశించి ప్రవేశపెట్టిన నెంబర్ డయల్ 100. ఏ తరహా ఇబ్బంది ఎదురైనా వెంటనే 100కు కాల్ చేయాలని పోలీస్ శాఖ పలు రకాలుగా ప్రచారం చేస్తోంది. అయితే కొంతమంది ఆకతాయిలు ఆ కారణంగా ఫోన్ చేసి పోలీసుల సమయం వృథా చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా బాంబులున్నాయంటూ ఫోన్లు చేస్తున్నారు. నిజమని నమ్మిన పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి వెళ్లి చూసిన తర్వాత అవి నకిలీ బెదిరింపు కాల్స్ అని తేలుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న శంషాబాద్ విమానాశ్రయానికి విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సోదాలు జరిపి నకిలీ బెదిరింపు కాల్‌గా గుర్తించి ఆగంతకుడిని అరెస్టు చేశారు.
శంషాబాద్ నుంచి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి డయల్ 100కి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే విమానాశ్రయంలో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది, శంషాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సోదాలు నిర్వహించి భద్రయ్య అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన ఆయన.. ఆలస్యంగా రావడంతో సిబ్బంది అతడిని లోపలికి అనుమతించలేదు. దాంతో విమానాన్ని ఆలస్యం చేసేందుకు డయల్ 100కి ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందని బెదిరించాడు.