కేంద్ర ప్రభుత్వం తరచుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం మత పరమైన ఉద్రిక్తతలు తీసుకొచ్చి మత కలహాలు సృష్టిస్తుందని ఆరోపించారు. ప్రతిఒక్క తెరాస కార్యకర్త భాజపా చేస్తున్న అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టాలని నాగోల్‌లో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో సూచించారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నిరంతరం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. తెరాస ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభకు నియోజకవర్గం నుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. దేశంలో అత్యధిక ధాన్యాలు పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. నగరంలో వరదలు వచిన్నప్పుడు ప్రజల ముందుకు వచ్చి నైతిక స్థైర్యంను అందించిన ఘనత తెరాస పార్టీ నాయకులదన్నారు. రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర స్ధాయిలో చర్చ జరుగుతుందన్నారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లో రిజిస్ట్రేషన్ సమస్యలను తీర్చుతామని పేర్కొన్నారు. వరద నీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా సైతం పాల్గొన్నారు.