Land acquisition: రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపాదించిన పలు పారిశ్రామిక ప్రాజెక్టుల వద్ద ధరలు భారీగా పెరగడంతో భూసేకరణ కష్టసాధ్యంగా మారుతోంది. ప్రత్యామ్నాయ స్థలాల వైపు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కొన్ని ప్రాజెక్టుల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం 1.57 లక్షల ఎకరాలతో భూబ్యాంకును ఏర్పాటు చేసింది. ఇవన్నీ ప్రభుత్వ భూములే. పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు వీటిని ప్రభుత్వం కేటాయిస్తోంది. వీటితో పాటు కొత్తగా వచ్చే పరిశ్రమల కోసం, పారిశ్రామిక నడవాల కోసం అదనంగా భూసేకరణ అనివార్యమవుతోంది.
నడవాలపై ప్రభావం:రాష్ట్రంలో హైదరాబాద్-వరంగల్; హైదరాబాద్-నాగ్‌పుర్ పారిశ్రామిక నడవాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. రెండు మార్గాల్లో పదేసి వేల ఎకరాలలో వీటిని స్థాపించాలనుకుంది. అందులో మూడొంతుల భూములు ప్రభుత్వానివి కాగా...మిగతావి సేకరించేందుకు సన్నాహాలు చేపట్టింది. జాతీయ రహదారికి ఆనుకొని ఉండే భూములు అవసరం కాగా... దాని కోసం అన్వేషణ చేపట్టింది. అధికారులు ఎక్కడికి వెళ్లినా భారీగా ధరలు చెప్పడంతో టీఎస్‌ఐఐసీ అధికారులు కొనుగోలుకు వెనుకాడుతున్నారు. వీటికి తోడు హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక నడవాలను ప్రభుత్వం కొత్తగా కేటాయించింది. ఆరు వేల ఎకరాల చొప్పున భూములను రెండు మార్గాల్లో సేకరించాల్సి ఉంది. ఈ మార్గాల్లో భారీ డిమాండు దృష్ట్యా భూసేకరణపై అధికారులు ఆందోళనలో ఉన్నారు. జహీరాబాద్ నిమ్జ్‌లో తొలుత భూములకు తక్కువ ధర ఉండేది. ఏటేటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు భూసేకరణ వ్యయం రెట్టింపు అయింది.
డ్రై పోర్టు ఏర్పాటులో జాప్యం:రాష్ట్రానికి బహుళవిధ లాజిస్టిక్స్ పార్కు(డ్రై పోర్టు)ను కేంద్రం మంజూరు చేసింది. దీనికి వెంటనే భూసేరణ చేయాలని సూచించింది. ప్రభుత్వం నల్గొండ జిల్లాలోని ఒక మండలంలో భూసేకరణ చేయాలని భావించింది. అక్కడ ధర పెరగడంతో సేకరణలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం దాన్ని మరో చోటుకు తరలించాలని యోచిస్తోంది. ఇవి గాక మరో 12 పారిశ్రామిక ప్రాజెక్టుల వద్ద ఇదే పరిస్థితి ఏర్పడింది.