Birth Anniversary Celebrations of Lalaji Maharaj: శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు, అందరూ అభిమానంగా 'లాలాజీ' అని పిలిచే రామచంద్రజీ మహారాజ్ 150వ జయంతి వారాన్ని పురస్కరించుకుని వైభవంగా జరుగుతున్న సంగీత, ధ్యాన కార్యక్రమాలకు కన్హాశాంతివనం వేదికైంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని ఈ శాంతివనంలో సంగీత వేడుకలు శ్రోతలను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి.
హార్ట్‌ఫుల్‌నెస్ ట్రస్ట్, శ్రీరామచంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 వరకు జరగనున్న ఈ సంగీత, ధ్యాన పండుగను ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన మార్గదర్శి కమలేశ్ డీ పటేల్ ప్రారంభించారు. తొలిరోజు సామూహిత ధ్యానం సమావేశాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం జరిగిన ప్రముఖ భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిట్ అజయ్ చక్రవర్తి కూతురు కౌశికి చక్రవర్తి గానకచేరి మంత్రముగ్దుల్ని చేసింది.
Birth Anniversary Celebrations at Kanha Shanti Vanam: వీనల విందుగా సాగిన తన గానామృతం, సంగీత కచేరితో అభ్యాసకులు తన్మయత్వంలో మునిగి తేలారు. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాలకు చెందిన పెద్దఎత్తున ప్రజలు ఈ ఉత్సవాలకు తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలది మంది వీక్షకులు ఆన్‌లైన్‌లో ఈ సంగీత, ధ్యాన వేడుకల్లో పాలుపంచుకుంటున్న కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వటం పట్ల కౌశికి చక్రవర్తి ఆనందం వ్యక్తం చేశారు.
సందర్శకుల సౌకర్యార్థం ప్రపంచంలోని మొట్టమొదటి ‘ఇన్నర్ పీస్’ మ్యూజియాన్ని ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన గురువు కమలేశ్ డీ పటేల్ ప్రారంభించారు. ఇందులో లాలాజీ మహారాజ్ స్వయంగా రాసిన బోధనలు, వారి జీవితాన్ని వర్ణించే కళాకృతులు, పెయింటింగ్‌లు, శిల్పాలు, ఇతర ఫలకాలు ప్రదర్శించబడతాయి. సృష్టి ఆది నుంచి మానవాళి అన్వేషిస్తున్న అత్యున్నతమైన అంతరంగ అన్వేషణ ఆకాంక్షకు బీజం వేయటమే, ఈ మ్యూజియం ఉద్దేశమని ట్రస్టు ప్రతినిధులు చెబుతున్నారు.