KTR Fires on BJP: రాష్ట్రంలో కుల, మత తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం సెస్సు విధించి.. రూ.30 లక్షల కోట్లు గుంజుకున్నది చాలు అన్న కేటీఆర్.. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం స్పందించి లీటరు పెట్రోలు రూ.70, లీటరు డీజిల్ రూ.65లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'8 ఏళ్లుగా ఒకే మాట మీద అందరం నడుస్తున్నాం. 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోంది. ఫ్లోరోసిస్ వ్యాధిని రూపుమాపింది కేసీఆర్ ప్రభుత్వం. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. ఈనాడు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ చేరుకుంది. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది. తెలంగాణ అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోంది. నూకలు తినండని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది. బియ్యం కొనుగోళ్లకు అడ్డుపడుతున్నారు. నూకలు తినండన్న భాజపాకు ఓటు వేయాలా? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేశారు.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి