KTR Comments on Congress and BJP in Rangareddy District :రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో నందిగామ మండలం చాకలిదాని గుట్ట తండా గ్రామ పంచాయతీ భవనాన్ని, కొత్తూరు మండల పరిధిలో కొత్తూరు మున్సిపల్ భవనాన్ని, 60 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. షాద్‌నగర్ పట్టణంలో 1700 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు.
KTR Visit to Rangareddy District Today : అనంతరం షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ (KTR ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా హామీలతో ప్రలోభపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్.. ఇవాళ అలవికాని హామీలు ఇస్తోందని దుయ్యబట్టారు. ఓటేస్తే షాద్‌నగర్‌లో చందమామను కట్టేస్తా అని ఆ పార్టీ నేతలు హామీలిస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ నాయకులకు, అదానీ నుంచి బీజేపీ నేతలకు డబ్బులు వస్తున్నాయని ఆరోపించారు. వారి వద్ద నుంచి దబాయించి పైసలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వస్తేనే బీఆర్ఎస్కు ఓటు వేయాలని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR Speech in Dharmapuri : 'కాళేశ్వరం కావాలా.. శనీశ్వరం లాంటి కాంగ్రెస్ కావాలా'
తొమ్మిదేళ్లలో ఎన్నో మంచి పనులు చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. షాద్‌నగర్‌కు నీళ్లు ఇచ్చేది కేసీఆర్.. తెచ్చేది అంజయ్య యాదవ్ అని అన్నారు. ఐదు రిజర్వాయర్లను నిర్మిస్తున్నామని.. లక్ష్మీదేవిపురం కూడా నిర్మాణం అవుతుందని చెప్పారు. బీజేపీ వాళ్లు నీళ్ల వాటా తేల్చరని.. కాంగ్రెస్ వారు కేసులేసి ఇబ్బంది పెడతారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ( Revanth Reddy) ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని.. ఆ పార్టీ నేతలే చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.
KTR Comments on Revanth Reddy : రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషి అని.. కెప్టెన్ అమరేందర్ సింగ్ సోనియాకు లేఖ రాశారని కేటీఆర్ పేర్కొన్నారు. తాము తెలంగాణ ప్రజలకు ఏ టీమ్‌గా ఉంటామని చెప్పారు. రేవంత్‌రెడ్డి.. బీజేపీతో కలసిపోయారని.. ఎన్నికల తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలోకి జంప్ అవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు.