KCR Inaugurated Brahmana Sadan : బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా వంద కోట్లు కేటాయించి, ఆ నిధులతో అర్చకుల అభ్యున్నతికి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలో 9 ఎకరాల స్థలంలో 12 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
వేదపండితుల గౌరవ భృతి రూ.5 వేలకు పెంపు : వేదపండితుల భృతి రెండున్నర వేల నుంచి 5 వేల రూపాయలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ భృతి.. అర్హత వయసును.. 75 నుంచి రూ 65 ఏళ్లకు తగ్గిస్తున్నట్టు చెప్పారు. ధూప, దీప, నైవేద్యాల పథకం కింద ఇచ్చే నిధిని ఆరు వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచుతున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 2వేల 796 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం విస్తరింపజేస్తామన్నారు.
అనువంశిక అర్చకుల సమస్యల పరిష్కారానికి సీఎం హామీ : అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో మంత్రివర్గంలో చర్చించి శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సదనంలో సమగ్ర గ్రంథాలయంతో పాటు సాంస్కృతి కేంద్రంగా విలసిల్లాలని ఆకాంక్షించారు. సూర్యాపేటలో బ్రాహ్మణ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఖమ్మం, మధిర, బీచుపల్లిలోనూ నిర్మిస్తామన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు, పండితులతో చండీయాగం నిర్వహించారు. అందరి ఆశీర్వచనాలు తీసుకున్న కేసీఆర్ పీఠాధిపతులను ఘనంగా సత్కరించారు.