తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కూడా తెరాసలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి గులాబీ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిపై ఈ రోజు కేసీఆర్ తుది నిర్ణయం తీసుకొనున్నారు.
కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టికెట్? - chevella
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి తెరాస తరఫున చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సబిత భేటీ కానున్నారు.
సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో కుమారునికి చేవెళ్ల ఎంపీ టికెట్ కావాలని కేటీఆర్‌ను అడిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడంలేదని నియోజకవర్గ కార్యకర్తలతో ప్రస్తావించిట్లు సమాచారం.
చేవెళ్ల టికెట్ కోసం తెరాస నేత రంజిత్‌రెడ్డి బరిలో ఉన్నారు. కార్తీక్ రెడ్డికి కేటాయించే అంశంపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకున్నట్లుగా తెలిసింది. పలువురు నేతలు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో బలమైనవిగా ఉన్న మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కుటుంబాల మధ్య సఖ్యత ఏర్పడితే పార్టీ బలోపేతం అవుతుందని ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామనే భావన గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీనిని సీఎం పరిగణనలోకి తీసుకుంటారని తెలుస్తోంది.