రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని వరద ధాటికి 23 కాలనీల్లో... 1,768 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. వీటిలో 465 ఇళ్లు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. 8 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 400 కుటుంబాలు ప్రభుత్వ శిబిరాల్లో ఉన్నారు. 65 కిలోమీటర్ల రహదారి దెబ్బతింది. దాదాపు 20 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 150 వీధి దీపాలు చెడిపోయాయి. 4 కిలోమీటర్ల మేర డ్రైనేజీ వ్యవస్థ పాడైందని జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
'నష్టం భారీగానే జరిగింది... త్వరలోనే సాధారణ స్థితికి తీసుకొస్తాం' - జల్పల్లి మున్సిపాలిటీ వార్తలు
భారీ వరదల కారణంగా జల్పల్లి మున్సిపాలిటీలో ఇళ్లు నీటమునిగాయి. కాలనీలో వరద నీరును తొలగించి... పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా... పారిశుద్ధ్య పనులు చేయిస్తూ... ప్రజలకు ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సాయం చేస్తున్నారు.
ఇప్పటివరకు 300 వందల మంది వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేల సహాయం అందినట్లు జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్క వరద బాధితుడికి సహాయం అందించేందుకు... 5 టీమ్‌లతో ఒక స్పెషల్ ఆఫీసర్‌ను వేసి... వివరాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిత్యావసరాలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా... పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానంగా నీట మునిగిన ఉస్మాన్ నగర్ ముంపు ప్రాంతం నుంచి... అలుగు ద్వారా నీటిని భారీగా పంపిస్తున్నామని... అదనంగా 20 హెచ్‌పీ సామర్థ్యం గల 4 మోటార్లు పెట్టి నీటిని బయటకు పంపిస్తున్నామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల్లోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:నష్టం రూ.9,422 కోట్లు.. కేంద్ర బృందానికి వివరించిన ప్రభుత్వం