ఔషధనగరి ప్రాజెక్టు కోసం మీర్‌ఖాన్‌పేటలో సేకరించే భూముల విషయంలో మతలబులు చోటుచేసుకుంటున్నాయి. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన ఎంజాయ్‌మెంట్ సర్వేలో వచ్చిన జాబితాను తారుమారు చేసి అనర్హులను అసైనీలుగా చేర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి సర్వే సంఖ్య 112లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 613 ఎకరాల భూములున్నాయి. అందులో 493 ఎకరాలు ప్రభుత్వ, అసైన్డ్ భూములు. మిగిలిన 120 ఎకరాలు పట్టా భూములు.
ఔషధనగరి తెరపైకి వచ్చాక ఇక్కడ 2016లో నాటి తహసీల్దారు ఎంజాయ్‌మెంట్ సర్వే చేయగా.. మొత్తంగా 842 ఎకరాలున్నట్లు తేల్చారు. ఇది రికార్డుల్లో ఉన్న దాని కంటే 229 ఎకరాలు అధికం. ఇలా ఎక్కువగా ఉన్నదాన్ని ప్రభుత్వ భూమిగా ఖరారు చేశారు. అదే ఏడాది అసైన్డ్‌దారుల నుంచి 32.27 ఎకరాలు, అనుభవదారుల నుంచి 284 ఎకరాలు తీసుకుని మొత్తంగా 316.27 ఎకరాలకు రూ.24.27 కోట్ల పరిహారం చెల్లించారు. మిగిలిన 525.73 ఎకరాలనూ టీఎస్‌ఐఐసీకి అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 248.50 ఎకరాల భూసేకరణకు అధికారులు రెండు ప్రకటనలు ఇచ్చారు.
ఓ యువకుడి పేరును భూసేకరణ జాబితాలో అసైన్డ్ రైతుగా నమోదు చేశారు. ఈ మండలంలో 1992 తర్వాత భూపంపిణీ చేయలేదు. అదే ఏడాది చేశారనుకున్నా, అతని వయసు అప్పటికి రెండేళ్లే! 2016లో నిర్వహించిన ఎంజాయ్‌మెంట్ సర్వేలో అతన్ని రెండెకరాల అనుభవదారుగా చూపించారు. గుట్టలున్నాయని తొలుత పరిహారానికి అర్హత లేదన్నారు. తర్వాత జాబితాను మార్చేసి.. అతనికి రెండెకరాల భూమి పంపిణీ చేసినట్లుగా రాశారు. ఇంకో వ్యక్తితో కలిసి 4.27 ఎకరాల పట్టా భూమికి సైతం అనుభవదారుగా పేర్కొన్నారు. ఇది చాలదన్నట్లు మరో 4.23 ఎకరాలకు అసైన్డ్‌దారుగానూ రాసేశారు.
నాడు గుట్టలు... నేడు భూములట..
తాజాగా సేకరించనున్న భూములకు పరిహారం చెల్లించేందుకు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. అయితే.. ఎంజాయ్‌మెంట్ సర్వే, ప్రస్తుత జాబితాలోని అసైన్డ్ రైతుల సంఖ్య సమానంగానే ఉన్నా.. వారి ఆధీనంలోని భూముల విస్తీర్ణంలో భారీ తేడా కనిపిస్తోంది. అప్పట్లో 497.28 ఎకరాలను పరిహారానికి అర్హమైనవిగా గుర్తించగా.. 316.27 ఎకరాలకు డబ్బులిచ్చేశారు. మిగిలిన 181.01 ఎకరాలలో రాళ్లు, గుట్టలున్నట్లుగా తేల్చారు. ఇప్పుడీ గుట్టలనే అసైన్డ్ భూములుగా చూపిస్తున్నారు. వాటిని మధ్యవర్తుల ప్రమేయంతో తమకు తెలిసిన రైతులతోపాటు కొత్తవారికీ తలాకొంత రాసినట్లు తెలుస్తోంది. ఇటీవలి ప్రకటనల ప్రకారం ఈ భూములకు ఎకరానికి రూ.22 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ 181.01 ఎకరాలను ఆసరాగా చేసుకుని ఏకంగా రూ.17 కోట్ల వరకు అవినీతి జరుగుతోందనే ఆరోపణలున్నాయి.
ఇవీ ఉదాహరణలు..
- స్థానిక మహిళ 2.20 ఎకరాల్లో పంటలు వేసుకుంటున్నట్లు 2016 నాటి ఎంజాయ్‌మెంట్ సర్వేలో నమోదు చేశారు. తాజా జాబితా నుంచి ఆమె పేరు తొలగించారు. ఇప్పటికీ ఆమె అదే భూమిలో సేద్యం చేసుకుంటున్నా పరిహారం అందని పరిస్థితి.
- అప్పట్లో స్థానికుడైన ఓ వ్యక్తిని 1.01 ఎకరాలకు అసైన్డ్, 1.06 ఎకరాలకు అనుభవదారుగా చూపించారు. ఎంజాయ్‌మెంట్ సర్వేలో 1.01 ఎకరాలను పీవోటీ కింద తొలగించారు. తాజాగా అతన్ని రెండెకరాలకు అసైనీగా పేర్కొంటున్నారు.
- ఎంజాయ్‌మెంట్ సర్వేలో ముగ్గురు వ్యక్తులు 1.14 ఎకరాలకు చొప్పున అనుభవదారులుగా తేలారు. రాళ్లురప్పలు పోగా అప్పటి పరిహారం జాబితాలో ఒక్కొక్కరికి 19 గుంటల చొప్పున నమోదు చేశారు. ప్రస్తుత జాబితాలో ఒకరిని ఎకరా, మరొకరిని 1.14 ఎకరాలకు అసైనీలుగా గుర్తించారు. దళారులకు డబ్బులివ్వనందుకే తన పేరు తొలగించినట్లు మూడో వ్యక్తి వాపోతున్నారు.
- స్థానికులైన ఇద్దరు వ్యక్తులకు 1.37 ఎకరాల చొప్పున అసైన్డ్ భూమితో పాటు, ఎకరా చొప్పున అనుభవదారులుగా గుర్తించారు. అంటే ఒక్కొక్కరికి 2.37 ఎకరాల చొప్పున భూమికి పరిహారం ఇవ్వాలి. తాజాగా ఒకరికి రెండెకరాలు ఉన్నట్లు పేర్కొని, మరొకరి పేరును తొలగించారు.
- తొలి సర్వేలో ఓ మహిళను 4.08 ఎకరాలకు అనుభవదారుగా గుర్తించారు. అందులోని 3.35 ఎకరాలను తీసేసి 13 గుంటలకు మాత్రమే పరిహారానికి అర్హురాలిగా తేల్చారు. ఇప్పుడామె నాలుగెకరాలకు అసైనీగా ఉండటం గమనార్హం.
అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవచ్చు..
టీఎస్‌ఐఐసీ సూచనతో 171.23, 77.27 ఎకరాల సేకరణకు రెండు ప్రాథమిక ప్రకటనలిచ్చామని కందుకూరు ఆర్డీవో రవీందర్రెడ్డి పేర్కొన్నారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే తహసీల్దారును కలవచ్చని తెలిపారు. ఇప్పటికే కొందరు అభ్యంతరాలు సమర్పించారన్నారు. రికార్డులు, ఎంజాయ్‌మెంట్ సర్వే జాబితాలను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. మరోసారి ఎంజాయ్‌మెంట్ సర్వే సైతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీచూడండి: సచివాలయం భవనాల కూల్చివేత పనులు ప్రారంభం