కరోనా చికిత్సకు కొత్త మందులు వచ్చేవరకు ప్రభావవంతంగా పనిచేస్తున్న పాత ఔషధాలనే ఉపయోగిస్తున్నారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున మన దేశంలోనూ అత్యవసర చికిత్సలో వాడేందుకు కొన్ని పాత మందులకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది.
లైసెన్సింగ్ ఒప్పందంతో మన ఫార్మా కంపెనీలు ఆయా ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వీటి ధరలు అందుబాటులో ఉండేలా.. దేశీయంగా లభించే ముడి పదార్ధాలతో తయారు చేసేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) రెమిడిసివిర్, ఫెవిపిరవిర్‌తోపాటూ మరో రెండు ఔషధాలను అభివృద్ధి చేసింది. వీటిని పలు కంపెనీలకు బదలాయించడంతో క్రమంగా ధరలు దిగి వస్తున్నాయి. ఇలా ఎన్నో పరిశోధనలకు కేంద్రమైన ఐఐసీటీ నేడు 77వ వార్షికోత్సవం జరుపుకొంటోంది.
పునాది 1944లోనే..
ఏడున్నర దశాబ్దాలుగా దేశ పారిశ్రామిక, ఆర్థిక రంగ పురోభివృద్ధికి ఎంతో కృషిచేసిన ఐఐసీటీకి పునాది 1944లో పడింది. అప్పటి హైదరాబాద్ స్టేట్‌లో నిజాం ఆదేశాలతో సెంట్రల్ ల్యాబరేటరీస్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ (సీఎల్‌ఎస్‌ఐఆర్) ఏర్పాటైంది. ప్రధాన క్యాంపస్ నిర్మాణానికి 1949లో శంకుస్థాపన చేయగా 1954 జనవరి 2 తొలి ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం చేశారు.