తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా దృష్ట్యా శంషాబాద్‌ విమానాశ్రయంలో సమూల మార్పులు' - శంషాబాద్‌ విమానాశ్రయం

కొవిడ్‌-19ని దృష్టిలో ఉంచుకుని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సమూల మార్పులు చేశారు. ప్రవేశ టెర్మినల్‌ నుంచి విమానంలో ఎక్కేవరకు ప్రతి విషయంలోనూ కరోనా నియమనిబంధనలకు పెద్ద పీటవేశారు. ప్రయాణికులతో ఏలాంటి సంబంధం లేకుండా... గుర్తింపు కార్డు, పత్రాల పరిశీలన దగ్గర నుంచి లగేజి బ్యాగుల స్కానింగ్‌ వరకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ఎస్‌జీకే కిషోర్‌తో ఈటీవీ భారత్‌ ప్రతినిధి తిరుపాల్‌ రెడ్డి ప్రత్యేక ముఖాముఖి.

shamshabad airport
shamshabad airport

By

Published : May 16, 2020, 3:51 PM IST

'కరోనా దృష్ట్యా శంషాబాద్‌ విమానాశ్రయంలో సమూల మార్పులు'

లాక్‌ డౌన్‌ సమయంలో విమానరాకపోకలు ఆగిపోయాయి. ఎప్పటి లోగా తిరిగి మొదలవుతాయని భావిస్తున్నారు ?

ఎయిర్‌ పోర్టు పూర్తిగా మూతపడలేదు. కార్గో విమానాలతోపాటు ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి. సాధారణ విమానాల రాకపోకలు లేవు. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే కార్యక్రమం కొనసాగుతోంది.

కొవిడ్‌-19ని దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయంలో ఏలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు?

లాక్‌ డౌన్‌ ఎత్తివేసి...విమానరాకపోకలు సాధారణ స్థితిలోకి వచ్చినా.. ముందున్న పరిస్థితులు ఉండవు. కొవిడ్‌-19 దృష్ట్యా చాలా మార్పులు వస్తాయి. కరోనాను ఎదుర్కొనడానికి భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శానిటైజర్లతో శుభ్ర పరచుకోవడం లాంటివి తప్పనిసరి అవుతాయి. హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కాంటాక్ట్‌లెస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నాం. మనిషికి, మనిషికి సంబంధాలు లేనివిధంగా కార్యక్రమాలు జరిగేట్లు చూస్తున్నాం. ట్రాకింగ్‌ టెక్నాలజీ ద్వారా ఎవరైనా భౌతిక దూరం పాటించనట్లయితే అలారమ్‌ వస్తుంది. వెంటనే అప్రమత్తమై భౌతిక దూరం అమలయ్యేట్లు చూస్తాం. విమానాశ్రయంలో కూర్చొనే కుర్చీ దగ్గర నుంచి అన్ని చోట్ల ప్రతి వస్తువును తరచూ శానిటైజ్‌ చేస్తాం.

వందే భారత్‌ మిషన్‌ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని విమానాలు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే కార్యక్రమం కొనసాగుతోంది. అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పని చేస్తున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారిని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు లేని వారిని హోటల్స్‌లో ఏర్పాటు చేసిన పెయిడ్‌ క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కరోనా ఉన్నట్లు పరీక్షల్లో తేలితే ప్రభుత్వ ఆస్పత్రికి పంపుతున్నారు.

విమానాశ్రయంలో... కస్టమ్స్‌, డీఆర్‌ఐ, సీఐఎస్‌ఎఫ్‌ వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉంటారు. ఆయా శాఖల వారీగా కరోనా నిలువరించేందుకు చర్యలు తీసుకున్నారు ?

కొవిడ్-19 నేపథ్యంలో కొత్త విధానాల రూపకల్పన జరుగుతోంది. అన్ని శాఖలు కలిసి నిర్దిష్ట కార్యాచరణ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రయాణికుడు ఎయిర్‌ పోర్టులోకి ప్రవేశించినప్పటి నుంచి విమానం ఎక్కే వరకు.. విమానం దిగిన ప్రయాణికుడు బయటకు వెళ్లే వరకు పాత పద్ధతుల్లో ఎక్కడెక్కడ కాంట్రాక్టులు ఉంటున్నాయనేది పరిశీలించాం. ఆయా ప్రాంతాల్లో శానిటైజ్‌ చేస్తున్నాం. గతంలో ప్రయాణికులు టర్మినల్‌ వద్దకు రాగానే ప్రవేశానికి ముందు ఇచ్చే గుర్తింపు కార్డులను ఫిజికల్‌గా పరిశీలన చేసేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా గుర్తింపు కార్డులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేశాం. మనిషితో సంబంధం లేకుండానే... పరిశీలన జరుగుతుంది. లోనికి వెళ్లిన తరువాత గతంలో మాదిరి ఒకరి వెంట ఒకరు కాకుండా... కనీసం నాలుగు అడుగులు దూరం ఉండేట్లు మార్కు చేశాం. లోనికి వెళ్లిన తరువాత ఎజెంట్లతో కూడా నేరుగా కలువకుండా గాజుగ్లాసు సీల్డ్స్‌ ఏర్పాటు చేశాం. అటు ప్రయాణికుడు, ఇటు ఏజంట్లు మాట్లాడేందుకు అవకాశం ఉటుంది. మంచినీళ్లు కావాలంటే గతంలో ట్యాప్‌ తిప్పాల్సి ఉండేది. వాటి స్థానంలో సెన్షార్స్‌ ఏర్పాటు చేశారు. మనిషి అక్కడికి వెళ్లగానే ట్యాప్‌లో నుంచి నీరు బయటకు వస్తుంది. అదేవిధంగా శానిటైజర్‌ కూడా చేయి పెట్టగానే కొన్ని చుక్కలు చేతిలో పడేట్లు సెన్షార్‌లు ఏర్పాటు చేశాం.

విదేశాల నుంచి వచ్చే వారి బ్యాగేజిని భౌతికంగా తనిఖీలు చేయకుండా తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలు ఏంటి ?

భౌతికంగా అవసరమైనప్పుడు తనిఖీ చేస్తారు. మూడు స్థాయిల్లో స్కానింగ్‌ యంత్రాలు ఉన్నాయి. ఎందులో అయినా... అనుమానం ఉంటే బ్యాగు తెరుస్తాం. ఇప్పుడు ప్రతి బ్యాగేజిని శానిటైజ్ చేస్తున్నాం. డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ ద్వారా శానిటైజ్‌ చేస్తున్నాం. పూర్తిగా శానిటైజ్‌ అయిన తరువాతనే ప్రయాణికుడి చేతికి బ్యాగు వస్తుంది. బ్యాగేజి తీసుకెళ్లే ట్రాలీలు కూడా ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తున్నాం.

విదేశాలకు వెళ్లే ప్రయాణికులు పాస్‌పోర్టు, వీసాలు పరిశీలించాల్సినప్పుడు.. చేతుల్లోకి తీసుకుని పరిశీలించకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ విధానం ఏమైనా ఉందా ?

ఇప్పట్లో అంతర్జాతీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యే సూచనలు లేవు. ఇప్పుడు డొమెస్టిక్‌ విమానాల్లో ప్రయాణించే వారికి పాస్టు పోర్టు అవసరం ఉండదు. గుర్తింపు కార్డులు పరిశీలించేందుకు కెమెరాలు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా పరిశీలన జరుగుతుంది. ఎంత వరకు వీలైతే అంతవరకు మనిషికి, మనిషికి దూరంగా ఉండేట్లు చూస్తున్నాం. ఒకవేళ భౌతికంగా పత్రాలను పరిశీలించాల్సి వస్తే... పరిశీలన ముందు... తరువాత చేతులను శానిటైజ్‌ చేసుకునే విధంగా చూస్తున్నాం.

లాక్‌డౌన్‌ ఎత్తి వేసిన తరువాత డొమెస్టిక్, ఇంటర్నేషన్‌ విమానాలు ప్రారంభమైతే అందుకు ఏలాంటి చర్యలు తీసుకున్నారు ?

ఎయిర్‌ పోర్టులో తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికుల బాధ్యత కూడా ఉంటుంది. కరోనాకు మందు లేదు. అది రావడానికి కొంత సమయం పడుతుంది. అవసరం ఉంటేనే ప్రయాణం చేయాలి. ప్రయాణించే వారు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. అవసరం లేని వస్తువులను ముట్టుకోకుండా ఉండాలి. మాస్క్‌లు ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం లాంటి చేసుకోవాలి. అన్నింటికంటే సురక్షితమైన ప్రయాణం... విమాన ప్రయాణం.

ఎప్పటి లోపల విమానరాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని భావిస్తున్నారు ?

ప్రజా రవాణాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రైళ్లను క్రమంగా నడుపుతోంది. విమానాలు కూడా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రతి రోజు విమానాయాన మంత్రిత్వ శాఖ సమావేశాలు నిర్వహిస్తూ... తాజా పరిస్థితులపై చర్చిస్తోంది.

పౌరవిమానయాన శాఖ నుంచి ప్రత్యేకమైన సూచనలుకాని, ఆదేశాలుకాని ఉన్నాయా?

విమానాల పునరుద్ధరణకు సంబంధిత స్టేక్‌ హోల్డర్స్‌తో తరచూ పౌరవిమానయాన శాఖ చర్చిస్తోంది. ఎస్‌వోపీని తీసుకొచ్చేందుకు చర్చలు నిర్వహిస్తోంది. డొమెస్టిక్‌ విమానాలు త్వరలో మొదలవుతాయి. అంతర్జాతీయ విమానాలు ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నాం.

ఇదీ చదవండి:హైజీనిక్​ కండిషన్​లోకి శంషాబాద్​ విమానాశ్రయం

ABOUT THE AUTHOR

...view details