Ramoji Foundation: రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. గతంలో అక్కడున్న అగ్నిమాపక కేంద్రం లోతట్టు ప్రదేశంలో ఉండటంతో కొద్దిపాటి వానలకు కూడా నీటమునిగేది. హయాత్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అండగా ఉన్న అగ్నిమాపక కేంద్రానికి కొత్తరూపు ఇచ్చేందుకు రామోజీ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. కోటిన్నర రూపాయలతో ఫైర్ స్టేషన్‌ను పూర్తి హంగులతో తీర్చిదిద్దింది.
ఈ కార్యక్రమంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఉషాకిరణ్ మూవీస్ డైరెక్టర్ శివరామకృష్ణ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దయానంద్ గుప్తా, ఎగ్గె మల్లేశం పాల్గొన్నారు. తెలంగాణ ఫైర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ జైన్, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, కార్పొరేటర్ నవజీవన్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
"రామోజీ ఫౌండేషన్‌కు ధన్యావాదములు తెలుపుతున్నాను. సామాజిక సేవలో భాగంగా అగ్నిమాపక కేంద్రం , పోలీస్‌స్టేషన్‌ను నిర్మించడం జరిగింది. అందులో భాగంగా రామోజీ ఫౌండేషన్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను." -మహమూద్ అలీ హోంమంత్రి