తెలంగాణ

telangana

ETV Bharat / state

HMDA: రంగారెడ్డిలో రెండు లేఅవుట్ల అభివృద్ధికి రంగం సిద్ధం

రంగారెడ్డి జిల్లాలో రెండు లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తూర్‌ మండలం ఇన్మూల్‌ నర్వాలో 75.39 ఎకరాలు, కందుకూరు మండలం లేమూరులో 77.37 ఎకరాలు సేకరించి రైతులతో ఒప్పందం చేసుకున్నారు.

hmda-decided-to-develop-two-layouts-in-rangareddy
రంగారెడ్డిలో రెండు లేఅవుట్ల అభివృద్ధికి రంగం సిద్ధం

By

Published : Aug 10, 2021, 10:39 AM IST

ఉప్పల్‌ భగాయత్‌ తరహాలో రంగారెడ్డి జిల్లాలో మరో రెండు లేఅవుట్లను అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు సన్నద్ధమయ్యారు. రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మండలం ఇన్మూల్‌ నర్వాలో 75.39 ఎకరాలు, కందుకూరు మండలం లేమూరులో 77.37 ఎకరాలు సేకరించి రైతులతో ఒప్పందం చేసుకున్నారు. లేఅవుట్ల ప్రణాళికలను తయారు చేశారు. వారం పది రోజుల్లో టెండర్లు పిలిచే అవకాశముంది.

60 శాతం రైతులకు..

భూముల్ని సేకరించి లేఅవుట్లుగా అభివృద్ధి చేస్తారు. ప్లాట్లలో 60 శాతం భూములిచ్చిన రైతులకు, 40 శాతం హెచ్‌ఎండీఏకు దక్కుతాయి. తమ వాటాను హెచ్‌ఎండీఏ విక్రయించి ఆదాయం సమకూర్చుకుంటుంది. ఉప్పల్‌ భగాయత్‌లో 733 ఎకరాలు సేకరించారు. 104 ఎకరాలు హెచ్‌ఎంఆర్‌ఎల్‌, 40 ఎకరాలు జలమండలి, 10 ఎకరాలు శిల్పారామం, మరికొంత ఇతర అవసరాలకు కేటాయించారు. సుమారు 300 ఎకరాలను లేఅవుట్‌ చేసి రైతులకు ప్లాట్లను కేటాయించారు. ఆ లేఅవుట్‌లో మిగిలిన, రెండోఫేజ్‌లో అభివృద్ధి చేసిన 191 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించగా రూ.767 కోట్ల ఆదాయం సమకూరింది. ఇంకా హెచ్‌ఎండీఏకు 40 ఎకరాలున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం, మేడ్చల్‌ జిల్లా కీసర మండలం బోగారంలో సర్వే చేసినప్పుడు కొందరు తమ భూములు కూడా ఉన్నాయంటూ అభ్యంతరం చెప్పారు. దీంతో ఈ రెండు చోట్ల లేఅవుట్‌ ప్రతిపాదన ఆగిపోయింది.

హెచ్‌ఎండీఏ సొంత నిధులతోనే..

అభివృద్ధి పనులకు నిధుల్ని సొంతంగానే సమకూర్చుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌పై దృష్టి సారించింది. ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చేలా రైతుల వాటాను 60 శాతానికి పెంచింది. ప్రహరీ, కంచె, రక్షణ చర్యలు తీసుకుంటుంది. నాలా, భూవినియోగ మార్పిడి, రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ డ్యూటీ, ఇతర ఖర్చులను భరిస్తుంది.

ఇదీ చూడండి:SCHOOLS REOPEN: ఆగస్టు 15 తర్వాత బడులు తెరుద్దాం!

ABOUT THE AUTHOR

...view details