తెలంగాణ

telangana

ETV Bharat / state

దిశ కేసు నిందితుల మృతదేహాలకు రేపు మళ్లీ శవ పరీక్ష - disha accused encounter

దిశ కేసు నిందితుల మృతదేహాలకు దిల్లీ ఎయిమ్స్ నిపుణులతో మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రేపు సాయంత్రం ఐదులోగా రీపోస్టుమార్టం నిర్వహించి.. నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఎన్​కౌంటర్​లో వాడిన ఆయుధాలను విశ్లేషణ కోసం కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని సిట్​ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వాస్తవాలు నిగ్గుతేలాలంటే ఆధారాలే కీలకమన్న హైకోర్టు.. న్యాయం జరగడమే కాకుండా.. జరిగినట్లు కనిపించాలని వ్యాఖ్యానించింది.

high court order to re postmortem to disha accused encounter
దిశ కేసు నిందితుల మృతదేహాలకు ఎల్లుండి మళ్లీ శవ పరీక్ష

By

Published : Dec 21, 2019, 7:48 PM IST

Updated : Dec 22, 2019, 6:43 AM IST

దిశ కేసు నిందితుల మృతదేహాలకు ఎల్లుండి మళ్లీ శవ పరీక్ష
దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింత, ఎన్​కౌంటర్ కేసులో ఆధారాల సేకరణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండోసారి శవపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టుకు హాజరైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్.. నలుగురి మృతదేహాలను రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య భద్రపరిచామని తెలిపారు. మృతదేహాలు ఇప్పటికే సగం కుళ్లి పోయాయని తెలిపారు. జీరో డిగ్రీల కన్నాక తక్కువ ఉష్ణోగ్రతతో మృతదేహాలను భద్రతపరిచే సదుపాయం దేశంలో ఎక్కడైనా ఉందా అని హైకోర్టు అడగ్గా... అలాంటి అవకాశం ఎక్కడా లేదని సూపరింటెండెంట్ తెలిపారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం

మృతదేహాలకు గాంధీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు నిపుణుల బృందం పోస్టుమార్టం నిర్వహించిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సేకరణకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొందని.. రీపోస్టుమార్టానికి ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉందని అమికస్ క్యూరీ ప్రకాశ్​ రెడ్డి అన్నారు.

రీపోస్టుమార్టానికే పరిమితం కావొద్దు

ఆధారాల సేకరణలో భాగంగా కేవలం రీపోస్టుమార్టానికి పరిమితం కాకుండా.. పోలీసుల కాల్ రికార్డులు, రిజిస్టర్లు, ఆయుధాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని హక్కుల సంఘాల తరఫు న్యాయవాది వ్రింద వాదించారు. అవన్నీ ఇప్పటికీ పోలీసుల ఆధీనంలోనే ఉన్నందున.. ఆధారాలు లేకుండా చేసే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మెజిస్ట్రేట్​తో విచారణ జరిపించకుండా.. ఆర్డీవోతో చేయించారని వాదించారు.

సీనియర్ ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం

సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం.. రేపు సాయంత్రం ఐదు గంటల్లోపు మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దిల్లీ ఎయిమ్స్ నుంచి ముగ్గురు అత్యంత సీనియర్ ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మెడికల్ బోర్డు రీపోస్టుమార్టం చేయాలని స్పష్టం చేసింది. ప్రక్రియను మొత్తం వీడియో చిత్రీకరించి.. నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

దిల్లీ ఎయిమ్స్​కు లేఖ రాయండి

రీ పోస్టుమార్టం కోసం దిల్లీ ఎయిమ్స్​కు లేఖ రాయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యులు వచ్చేందుకు విమాన రవాణ సౌకర్యంతో పాటు.. హైదరాబాద్​లో అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రీ పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని గాంధీ సూపరింటెండెంట్​ను ఆదేశించింది.

ఆధారాలే కీలకమని వ్యాఖ్య

ఎన్​కౌంటర్​పై వాస్తవాలు నిగ్గు తేలాలంటే ఆధారాలే కీలమని హైకోర్టు పేర్కొంది. ఆధారాలన్నీ సేకరించి భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్​ను ఆదేశించింది. ఎన్​కౌంటర్​లో వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. బాలిస్టిక్ పరీక్షల కోసం హైదరాబాద్​లోని కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించాలని చెప్పింది. న్యాయం జరగటంతో పాటు... జరిగినట్లు కనిపించడం ముఖ్యమేనని రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ

Last Updated : Dec 22, 2019, 6:43 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details