High Court Questioned Govt Regarding Government Educational Institutions: ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతుల మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస వసతులు లేవంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారంటూ ఓ పత్రికలో ప్రచురితమైనన కథనాన్ని చేస్తూ ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్ రాసిన లేఖను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. సరూర్‌నగర్‌లోని ప్రభుత్వ కాలేజ్‌లో 700 మంది విద్యార్థినులకు ఒకే ఒక్క పనిచేయని ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉండటంతో హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ విషయంపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన మణిదీప్ రాసిన లేఖలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని లేఖలో రాశారు. ఒకే మరుగుదొడ్డి ఉండడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారని.. రుతుక్రమం సమయంలో కాలేజ్‌కు రావడానికి ఇష్టపడడం లేదని.. ఒకవేళ వచ్చినా అందుకు తగిన మాత్రలు మాత్రలు వాడుతున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో గత మూడు నెలలుగా విద్యార్థులు అధికారులకు లేఖ రాసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. వారు పట్టించుకోకపోవడం వల్ల దాదాపు 300 మందికి పైగా సరూర్‌నగర్ జూనియర్ కళాశాల విద్యార్థులు తమ తరగతులను బహిష్కరించారని తెలిపారు.
అదే కళాశాలలోని బాలురు కూడా సరైన మరుగుదొడ్డి వసతులు లేక బయటకు పోతున్నారని చెప్పారు. ఎన్నిసార్లు అధికారులకు లేఖలు రాసిన పట్టించుకోకపోవడంతో.. మానవహక్కుల కమిషన్‌కు లేఖ రాశానని ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్ వెల్లడించారు. అయితే అక్కడ కూడా ఛైర్మన్, సభ్యులు లేకపోవడంతో హైకోర్టుకు నేరుగా లేఖ రాశానన్నారు. సుమోటోగా స్వీకరించిన ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణకు తీసుకుంది.