Rangareddy District Library : ఉద్యోగ నోటిఫికేషన్ల రాకతో అభ్యర్థులు ప్రభుత్వ కొలువులు సాధించడమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గంటల కొద్దీ ఎలాంటి అవాంతరాలు లేకుండా చదువుకునే ఉద్దేశంతో గ్రంథాలయాల బాట పడుతున్నారు. ఉద్యోగార్థుల కోసం రాష్ట్రంలోని పలు గ్రంథాలయాలు కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
good facilities at Rangareddy District Library : పోటీ పరీక్షల దృష్ట్యా ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గ పరిధి బడంగ్‌పేట్‌లోని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో అభ్యర్థులకు అన్ని ఏర్పాట్లు చేసింది. మహిళా అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడం, మహిళా సిబ్బంది పర్యవేక్షించడం ఇక్కడి మరో ప్రత్యేకత. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారు.
'ఈ లైబ్రరీ మా ఇంటికి దగ్గరలో ఉంది. ఇక్కడ మాకు కావాల్సిన పుస్తకాలు అన్నీ లభిస్తున్నాయి. నీళ్లు, వాష్‌రూమ్స్ అన్ని వసతులు బాగున్నాయి. మహిళలకు, పురుషులకు సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి. బయట నెలకు రూ.200 చెల్లించి చదువుకునే వాళ్లం. కొన్నిసార్లు సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కావు. కానీ ఇక్కడ మేం ఉచితంగా చదువుకుంటున్నాం. సౌకర్యాలు కూడా బాగున్నాయి. ఇంకా పుస్తకాలు, పేపర్లు ఇవన్నీ కూడా ఉచితంగానే లభిస్తున్నాయి.' - ఉద్యోగార్థులు
పోటీ పరీక్షల కోసం సుమారు 5 వేల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. వీటితోపాటు 46 దినపత్రికలు, వార, మాస పత్రికలు ఉన్నాయి. నిత్యం 400 మంది అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. 2000 చదరపు గజాల్లో నాలుగున్నర కోట్ల వ్యయంతో 18 విశాలమైన హాల్స్, ఇతర గదులు నిర్మించారు.