మున్ముందు వర్షాలు మరింతగా కురవనున్నాయి. వరద పోటెత్తే అవకాశాలున్నాయి. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్‌లో.. ఈ దఫా.. పౌరులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వరద ముప్పు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ల వాసులకు జాగ్రత్త తప్పనిసరి అంటున్నారు. సెల్లార్లు ఉంటే ఇప్పటి నుంచే వరద నుంచి గట్టెక్కేందుకు అవసరమైన చర్యలు పూర్తి చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం, ఇంజినీరింగ్ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
Heavy Floods : మున్ముందు వరద ముప్పు.. జాగ్రత్తలు సూచిస్తోన్న జీహెచ్‌ఎంసీ
రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో గతేడాది వరద ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. భాగ్యనగరంలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు నగర పౌరులను అప్రమత్తం చేస్తోంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో గతేడాది ఆగస్టు మొదటి వారం నుంచి అక్టోబరు 22 వరకు అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌లోని పల్లె చెరువు, బార్కస్‌లోని గుర్రం చెరువులకు గండి పడింది. కుత్బుల్లాపూర్ ఫాక్స్‌సాగర్, నాగోల్ బండ్లగూడ చెరువు, ఉప్పల్‌లోని పెద్దచెరువు, చిన్నచెరువు, హయత్‌నగర్ కప్పలచెరువు, బాతులచెరువు, కుమ్మర చెరువు, టోలీచౌకి శాతమ్‌చెరువు, సరూర్‌నగర్ చెరువు, కుత్బుల్లాపూర్ పటేల్ చెరువు, మెహబూబ్‌కుంట, ఊరకుంట, చింతల్‌చెరువు, మల్కాజిగిరి బండచెరువు, అల్వాల్ పెద్ద చెరువులు పొంగిపొర్లాయి. వరద తీవ్రతతో 5 వేల కాలనీలు నీట మునిగాయి. లక్ష ఇళ్లు ముంపునకు గురయ్యాయి. బాధితులు వర్షాకాలం ముగిసిన రెండు, మూడు నెలల వరకు కోలుకోలేకపోయారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు బాధిత ప్రాంతాలకు ముందు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
ఇలా చేయాలి..
- సెల్లార్లున్న అపార్ట్‌మెంట్లలో బోరు బావి, సంపు మోటార్లు, విద్యుత్తు మీటర్లు, జనరేటర్లనూకిందనే ఉంటాయి. వాటిని పై అంతస్తులోకి అమర్చుకోవాలి. లేదా నీరు ఏ స్థాయి వరకు వస్తుందో.. ఆ ఎత్తు వరకు దిమ్మె నిర్మించుకుని, దానిపై ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
- రెండేళ్ల క్రితం కురిసిన వర్షాలకు సికింద్రాబాద్ జోన్‌లో లిఫ్టు ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్‌లోకి వరద చేరుకున్న విషయం తెలియక.. పై అంతస్తులోని వ్యక్తి లిఫ్టులో కిందకు దిగే ప్రయత్నం చేశారు. కింది అంతస్తులోకి రాగానే లిఫ్టు పని చేయడం ఆగిపోయింది. అందులోకి నీరు చేరి లోపల ఉన్న వ్యక్తి మృతిచెందాడు. నీరు నిలిచే సెల్లార్లున్న అపార్ట్‌మెంట్లలో వర్షాలొచ్చినప్పుడు లిఫ్టులను ఉపయోగించకపోవడం మంచిది.
- ప్రతి అపార్ట్‌మెంట్‌లోనూ సెల్లారులో ఓ మూలన మడ్ సంప్‌ను నిర్మించుకోవాలి. నీరు భూమిలోకి ఇంకేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- రాష్ట్ర సర్కారు ఇటీవల సెల్లార్‌లో కాకుండా.. పై అంతస్తులో పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకునే వారికి ఎత్తు నిబంధన మినహాయింపు ఇచ్చింది. అందువల్ల వరద ప్రభావిత ప్రాంతాల్లో సెల్లార్లు తవ్వకుండా గ్రౌండ్, ఒకటి, రెండు అంతస్తులను పార్కింగ్ వదిలేయడం ఉత్తమమని ప్రణాళిక విభాగం చెబుతోంది.
- పాత కాలం నాటి, కూలేందుకు సిద్ధంగా ఉన్న ప్రహరీలను కూల్చేయాలని, కొత్తవి నిర్మించుకోవాలి.
- సెల్లార్‌లోకి వాహనాలను తీసుకెళ్లేందుకు నిర్మించే ర్యాంపు ద్వారా, సెట్ బ్యాక్ సందుల నుంచి లోపలికి వరద ప్రవేశిస్తుంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా.. రోడ్డు కన్నా ఎత్తు ఉండేట్లు ర్యాంపు నిర్మించుకోవాలని, సెట్ బ్యాక్‌లను తాత్కాలికంగా వెలుతురు ఇచ్చే రేకులతో మూసేయాలని సూచిస్తున్నారు.
గతేడాది ముంపు సమస్య ఇలా..
- వారం నుంచి పది రోజుల పాటు ముంపులో ఉన్న కాలనీలు 4 నుంచి 5 వేలు
- వాటి పరిధిలోని భవన నిర్మాణాలు 80 వేల నుంచి లక్ష
- కాలనీల్లోని జనాభా 3 నుంచి 5 లక్షలు