raithu bandhu funds release: రాష్ట్రంలో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి 10వేల చొప్పున ఇప్పటి వరకు రూ.50447.33కోట్లు రైతుల ఖాతాలో జమచేసినట్లు మంత్రి వివరించారు. రైతు బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు 83118 మంది రైతు కుటుంబాలకు 4150.90కోట్లు పరిహారం అందజేసినట్లు పేర్కొన్నారు.
ఒక్కో ఎకరా పెంచుకుంటూ ఆరోహణ క్రమంలో..:ఎకరాకు 5వేల చొప్పున తక్కువ భూవిస్తీర్ణం కలిగిన వారితో ప్రారంభించి ఆరోహణా క్రమంలో సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ఇవాళ ఒక ఎకరం లోపుతో ప్రారంభించి రోజుకు ఒక ఎకరా చొప్పున పెంచుకుంటూ పోతారు. మంచిరోజు అన్న ఉద్దేశంతో శుక్రవారం రోజే పది మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. వచ్చే నెల మొదటి వారంలో రైతుబంధు చెల్లింపుల ప్రక్రియ పూర్తి కానుంది.
ఆ పంటలకు ప్రోత్సాహం:సీజన్‌కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా 20లక్షల ఎకరాల్లో సాగులక్ష్యంగా ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగుతో పాటు పప్పు, నూనెగింజలు, కందులు, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పప్పుశెనగ, పొద్దు తిరుగుడు, మినుములు, పెసల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. రైతు వేదికలలో సమావేశాలతో పాటు, క్షేత్రస్థాయి పర్యటనలతో వ్యవసాయ అధికారులు రైతులను పంటల మార్పిడి దిశగా చైతన్యం చేయాలని .. రైతులతో వ్యవసాయ అధికారుల అనుబంధం మరింత పెరగాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు సైతం రైతువేదికల సమావేశాలకు హాజరై వారితో సాన్నిహిత్యం పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: