హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటును నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. వారికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ సంఘీభావం తెలిపారు. రాష్ట్రానికి హానికరమైన హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కాలుష్యాన్ని అరికట్టకుండా.. మరో పరిశ్రమ ఎలా తీసుకొస్తారు? - farmers protest in ibrahimpatnam
తెలంగాణకు హానికరమైన హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల కాలుష్యం అరికట్టకుండా.. మరో విష రసాయనకారక ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే మరింత విధ్వంసమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
![కాలుష్యాన్ని అరికట్టకుండా.. మరో పరిశ్రమ ఎలా తీసుకొస్తారు? farmers protest at ibrahimpatnam in rangareddy district today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8749209-125-8749209-1599727658646.jpg)
ఇబ్రహీంపట్నంలో రైతుల ఆందోళన
ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వమంటూ తాటిపర్తి, కుర్మిద్ద, నానక్గూడ, మేడిపల్లి గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో... భూసేకరణకు సంబంధించి సాధారణంగా ఊరిలోనే గ్రామసభ నిర్వహించాల్సందిపోయి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరపడం ఏంటని రైతులు ప్రశ్నించారు.
భూసేకరణ చట్టం - 2013 ప్రకారం పచ్చని పంట భూములు సేకరించడం నిబంధనలకు విరుద్ధమని కోదండరామ్ ప్రస్తావించారు. తక్షణమే ప్రభుత్వం ఈ బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని... లేని పక్షంలో రైతుల ఆగ్రహం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.