రైతులకు నష్టం కలిగించే ఫార్మా కంపెనీలను తెస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు వంశీ చందర్ రెడ్డి, కోదండ రెడ్డి పేర్కొన్నారు. అన్నదాత పక్షాన పార్టీ ఎల్లపుడు పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యేల మద్దతు..
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కూర్మిద్దా గ్రామంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. అన్నదాతలకు మాజీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. మేడిపల్లి, నానక్‌నగర్ కర్షకులు దీక్షలో పాల్గొని.. జాతీయ జెండాలు పట్టుకొని భూమి ఇచ్చేదిలేదని ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నినదించారు.
లాక్కుంటోంది..
వ్యవసాయ భూములు లాక్కుంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అసైన్డ్ భూములు మాత్రమే తీసుకుంటామని మొదట చెప్పి.. నేడు పట్టా భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని ఆరోపించారు. ఫార్మా కంపెనీకి ఎట్టిపరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదన్నారు.
కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ..
కర్మాగారాలను కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తోందని వంశీ చందర్ రెడ్డి అన్నారు. రైతులు కలిసికట్టుగా పోరాడితే ఫార్మసీటీని తరిమికొట్టొచ్చని కోదండ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్రెడ్డిలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:దేశ సగటుతో పోలిస్తే బడ్జెట్‌లో తక్కువ నిధులు: భట్టి