No Age Difference In Eye Problems : ఒకప్పటితో పొల్చితే పిల్లల్లో కంటిసమస్యలు పెరుగుతున్నాయి. ఎవరు అవునన్నా, కాదన్నా కళ్లముందు కనిపిస్తున్న సత్యమిది. 6 నుంచి 18ఏళ్లలోపు పిల్లలున్న ఏ తరగతి గదిలోకి వెళ్లినా కనీసం ఒక్కరైనా కళ్లజోళ్లతో దర్శనమిస్తున్నారు. కంటి సమస్యలతో బాధపడే పిల్లల సంఖ్య 5% వరకు ఉంటోంది. జాతీయ బాలల ఆరోగ్య కార్యక్రమం ఆర్బీఎస్కే కింద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2022 మార్చి నుంచి డిసెంబర్ వరకు లక్షా యాభై వేల మంది విద్యార్థులను పరీక్షిస్తే, 2016 మంది పిల్లలు నేత్రసమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 2023 జనవరి నుంచి జూన్ వరకు 90 వేల మందిని పరీక్షిస్తే అందులో వెయ్యి మంది పిల్లలు.. 2022 మార్చి నుంచి 2023 జూన్ వరకు వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న విద్యార్థులు 7,687 మంది. వారికి మహబూబ్‌నగర్ డైస్లో చికిత్స అందించగా అందులో 3 వేలమంది కంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లే ఉన్నారు. ఒకప్పుడు 40 ఏళ్ల పైబడిన వాళ్లలోనే కంటి సమస్యలు చూసేవాళ్లం. కానీ, ఇప్పుడు చిరుప్రాయంలోనే కంటి సమస్యలు వస్తున్నాయి. దీనికి పెరిగిన డిజిటల్ తెరల వినియోగం కారణమనేది కొందరి వాదన. కానీ, పిల్లల కంటి సమస్యలకు అనేక కారణాలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లల్లో కంటి సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Eye Infection Precautions :మారుతున్న జీవనశైలి పెద్దల్లోనే కాదు.. పిల్లల్లోనూ అనేక సమస్యల్ని తెచ్చిపెడుతోంది. అందులో ముఖ్యమైంది పౌష్టికాహారలోపం. బలమైన ఆహారాన్ని తీసుకోవడంలో పిల్లలు విఫలమవుతున్నారు. పాలు, గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తినడంపై చదువుకునే పిల్లలు ఆసక్తి చూపడం లేదు. వాటికి బదులుగా జంక్‌ఫుడ్‌కు ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులు కూడా విషయాన్ని గమనించకుండా ఓ విధంగా జంక్‌ఫుడ్‌ను ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటు సరైన సమయానికి ఆహారం తీసుకోవడంపై పిల్లలు దృష్టి సారించడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో 20 నుంచి 30% మంది ఉదయం అల్పాహారం తీసుకోకుండానే వెళ్తున్నారు. శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగడం లేదు. కంటినిండా నిద్ర కూడా పిల్లలకు ఉండటం లేదు. ఇలాంటి అలవాట్లన్నీ దీర్ఘకాలంలో కంటిపై ప్రభావం చూపుతాయని అందుకే చిన్న వయసులోనే పిల్లలకు కంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు వైద్యులు.
Eye Problems In Children : నేటితరంపిల్లల్లో కంటిసమస్యలు పెరగడానికి మరో బలమైన కారణం డిజిటల్ తెరల వీక్షణం. పిల్లలు ఏడిస్తే పెద్దలు వారికి ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ ఇస్తే తప్ప పిల్లలు ఊరుకోని పరిస్థితి. ఆడించానికీ ఫోనే.. ఆనందం వచ్చినా, అల్లరి చేసినా అన్నింటికీ ఫోనే సర్వస్వం అయిపోయింది. ల్యాప్‌టాప్, నోట్‌ప్యాడ్, ట్యాబ్, టీవీ, కంప్యూటర్ ఇలాంటివాటి నుంచి కళ్లు తిప్పుకోవడమే కష్టమై పోయింది. ఇలా పరిమితికి మించి డిజిటల్ తెరలు వీక్షించడం వల్ల కళ్లు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం డిజిటల్ తెరలను చూడటం వల్ల తేమ తగ్గుతుంది. కళ్లు పొడిబారతాయి. మంట మొదలువుతుంది. నీరుకారడం, మసకబారడం, కళ్లనొప్పి లాంటివి ఏర్పడతాయి. ఎలక్ట్రానిక్ పరికరాల్లో వెలువడిన నీలి కాంతితో రెటీనా దెబ్బతింటుంది. అసలు చదువుకునే పిల్లలు ఫోన్లే వినియోగించవద్దని, బోధనకు డిజిటల్ ప్రత్యామ్నాయం కాదని యునెస్కో తన నివేదికలో వెల్లడించింది.
పిల్లలు చదువుకునే వాతావరణం సైతం కంటిపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పిల్లలు సహజ వెలుతురులో చదవడాన్ని తగ్గిస్తున్నారు. బయట కావాల్సినంత వెలుతురున్నా.. తలుపులు, కిటికీలు మూసివేసి చీకటి గదుల్లో, ఎల్ఈడీ బల్బుల కింద చదువుతున్నారు. వెలుతురు లేని సమయాల్లో ట్యూబ్ లైట్లు వేసుకోవాలి తప్ప ఎల్ఈడీల వాడకం మేలైంది కాదని సూచిస్తున్నారు. వెలుతురు పుస్తకంపై పడేలా సరైన దిశలో కూర్చొని, 30 సెంటీమీటర్ల దూరంలో పుస్తకాల్ని ఉంచుకుని చదవడం, రాయడం చేయాలి. అలా కాకుండా పడుకుని, నిలబడి, తిరుగుతూ ఇలా ఇష్టానుసారం పిల్లలు చదువుతున్నారు. దీని వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి త్వరగా అలసిపోతాయి. ఎలాంటి వాతావరణంలో చదవాలన్న అంశంపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈతరం పిల్లలు ఆటలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వీలుదొరికితే మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు. శారీరక వ్యాయామం ఉండటం లేదు. వీలైనంత వరకు పిల్లల్ని ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలంటున్నారు వైద్యులు. సహజ వెలుతురులో సమయం గడపడం వల్ల హ్రస్వదృష్టి -మయోపియా ప్రమాదాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.