ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి జయరామ్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈఎస్ఐ కేసులో ఏ14గా ఉన్న వ్యక్తి... మంత్రి కుమారుడు ఈశ్వర్ కు పుట్టినరోజు సందర్భంగా బెంజ్ కారు ఇచ్చారని తెలిపారు. సదరు నిందితుడు(ఏ14) మంత్రి జయరామ్ కు బినామీ అని... అందుకే ఆయన కుమారుడికి కారు ఇచ్చారని వ్యాఖ్యానించారు.
'ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి పాత్ర... బర్త్‌రఫ్ చేసి విచారించండి' మంత్రిని తప్పించాలి..
ముద్దాయికి మంత్రి జయరామ్ కుమారుడికి ఉన్న సంబంధాలేంటని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఈ విషయమై ప్రభుత్వం విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రిపై వస్తున్న అభియోగాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని... జయరామ్ ను మంత్రి మండలి నుంచి తప్పించాలన్నారు.
ఆధారాలున్నాయి...
ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపడానికి సిద్ధంగా ఉన్నానని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భంలోనూ మంత్రిని కొనసాగించడం న్యాయం కాదన్న ఆయన... మంత్రి కుమారుడికి ఇచ్చింది పుట్టినరోజు కానుక కాదని.. లంచం అని తేల్చి చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అణిచివేయాలని చూడడం సబబు కాదని హితవు పలికారు. ఈఎస్‌ఐ కేసులో ఆధారాలతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఈ కేసులో అక్రమంగా, ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ నాయకుడైనా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని ఆక్షేపించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ కు అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:కేంద్ర హోంశాఖ మంత్రికి భాజపా ఎంపీల లేఖ