ప్రతి విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ఎంతో కీలకమని.. ఏ స్థాయికి చేరుకున్నా వారు గర్వంగా చెప్పుకునేలా ఉపాధ్యాయుల కృషి ఉండాలని ఈనాడు ఎండీ, రమాదేవి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సి.హెచ్.కిరణ్ తెలిపారు. ప్రతి విద్యార్థి తాము చదువుకున్న రోజుల్లో జరిగిన సంఘటనలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని, వారి కుటుంబానికి, పిల్లలకు కథలుగా చెబుతుంటారని వివరించారు. పిల్లలను దండించకుండా.. ప్రేమాభిమానాలతో మెలగాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ సమీపంలోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు.
ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న ఈనాడు ఎండీ కిరణ్.. తాను చదువుకునే రోజుల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదువుకున్న పాఠశాలకు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గొప్పపేరు తెచ్చేలా విద్యార్థులు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే రమాదేవి పబ్లిక్ స్కూల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి పెద్దఎత్తున డిమాండ్ ఉందని, అందుకు ఉపాధ్యాయులందరూ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ప్రతి విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ఎంతో కీలకం. విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నా గర్వించేలా గురువుల పాత్ర ఉండాలి. చదువుకున్న పాఠశాలకు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు గొప్పపేరు తెచ్చేలా విద్యార్థులు కృషి చేయాలి. - సీహెచ్ కిరణ్, ఈనాడు ఎండీ, రమాదేవి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు..: పాఠశాలలో అనుసరిస్తున్న నాణ్యత ప్రమాణాల కారణంగా కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రవేశాలకు డిమాండ్ ఏర్పడిందని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 2,172 నుంచి 2,572కు విద్యార్థుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన సిబ్బందిని పెంచుకున్నట్లు చెప్పారు. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు నేర్పించేందుకు కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచామన్న ఆమె.. అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఆడియో - విజువల్ బోధనకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ప్రీ ప్రైమరీ దశలో పిల్లలకు ఓనమాలు నేర్పించడంతో పాటు ఆటలకు ప్రాధాన్యమిచ్చేలా ఎన్నో సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు గ్రంథాలయంతో పాటు నృత్యం, సంగీతం నేర్పించేందుకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు పని చేస్తున్నట్లు ఆమె వివరించారు.