నగరంలో వర్షం పడితే చాలు ప్రజలు భయం గుప్పిట్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు నగర ప్రజలు వణికిపోతున్నారు. హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పొంగి పోర్లుతున్న డ్రైనేజీ వాటర్ ఇళ్ల మధ్య పేరుకుపోవడంతో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు భాగ్యనగర్ ఫేస్ టు కాలనీ వాసులు.
గత 14 నెలలుగా అదే సమస్య..
గత 14 నెలలుగా డ్రైనేజీతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్‌ను కలిసిన సమస్యకు పరిష్కారం కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలోని లోతట్టు ప్రాంతంలో డ్రైనేజీ వాటర్ పొంగిపొర్లి మోకాళ్ల లోతు వరకు రోడ్లపైకి నీరు వచ్చి చేరుతోంది. కనీసం నిత్యాసరాలకు బయటకు రాలేని పరిస్థితి. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టలేని దుస్థితి భాగ్యనగర్ ఫేస్ టూ కాలనీ వాసులది.
జేసీబీ అద్దెకు తీసుకుని మరీ...
బయటకొచ్చేందుకు మరో మార్గం లేక నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లేందుకు జేసీబీని అద్దెకు తీసుకున్నారు ఆ కాలనీ వాసులు. గతంలో ట్రాక్ లైన్ నిర్మాణానికి 23 కోట్ల రూపాయలు మంజూరైనా.. పక్క కాలనీ వాసులు ఒప్పుకోవడం లేదని జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణ పనులు నిలిపి వేశారని ఆరోపించారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి ఈ దుర్భర పరిస్థితి నుంచి కాపాడాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువులను కొనేందుకు కాలనీవాసులంతా కలిసి జేసీబీ అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.