కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల వజ్రాలు, బంగారం గనులున్నాయని జీఎస్ఐ తెలిపింది. జిల్లాలోని మాడుగుల మండలం అవురుపల్లిలో ఓ రైతు భూమి దున్నేటప్పుడు మెరుస్తున్న రాయి దొరికింది. దాన్ని హైదరాబాద్లోని ఓ ల్యాబ్లో పరిశీలించగా అది వజ్రమని తేలింది. ఏడేళ్ల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఓయూలోని భూభౌతిక విభాగం సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ గ్రామ పరిసరాల్లో బంగారు, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ గ్రామం కృష్ణా నది ఎగువన నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోనే ఉండటం వల్ల 2018 వరకు ఇక్కడ ఓయు భూ భౌతిక శాస్త్ర విభాగం చేసిన పరిశోధనలు, యూజీసీకి సమర్పించిన నివేదికకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. నివేదికలో నల్గొండ జిల్లాలోని కృష్ణ ,మూసీ నది పరివాహక ప్రాంతాల్లోనే పెద్దవాగు, డిండి, హాలియా పలుచోట్ల భూగర్భంలో వజ్రాల బంగారు గనులు ఉన్నట్టు ఓయూ భూభౌతిక విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు సర్వేలో గుర్తించిన పరిశోధన నివేదికను యూజీసీ సమర్పించారు. అంతకు పదేళ్ళ ముందే జీఎస్ఐ శాస్త్రవేత్తలు 2008లో భూగర్భ గనులపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు రీజనల్ సర్వే చేసి నివేదిక సమర్పించారు.
ఐదేళ్ళపాటు క్షేత్ర స్థాయిలో పరిశోధన...
ఓయూ భౌతికశాస్త్ర విభాగం అప్పటి అధిపతి ఆచార్య రాందాస్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు 2013లో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశోధనలు ప్రారంభించారు. ప్రాథమిక దశలో రీజినల్ సర్వే నిర్వహించారు. రెండో దశలో సమగ్ర సర్వే నిర్వహించి కృష్ణా నది పరివాహక ప్రాంతమైన నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ సమీపంలోని దేవరకొండలో యురేనియం, పెద్దవూర మండలంలో ఐరన్, మిర్యాలగూడెం సమీపంలోని అనుముల మండలం రామడుగు, గుర్రంపోడు మండలం కనగల్ వద్ద వజ్రాలు, బంగారం గనులు ఉన్నట్టు గుర్తించారు.