దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా విధానాలను ప్రజలు వ్యతిరేకించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రోజుకో మాట పూటకో మాట మాట్లాడే సీఎం కేసీఆర్‌కు(Tammineni Veerabhadram Fire On cm kcr) హుజూరాబాద్ ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై తెరాస వైఖరి సరిగా లేదని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా వాటి రద్దు కోసం కేరళ సీఎం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని... కానీ తెరాస ప్రభుత్వం మాత్రం మోదీకి అండగా ఉన్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో గల ఓ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన... 2022 సీపీఎం రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశంలో(CPM party state convention meeting) తమ్మినేని పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభల కోసం ఇబ్రహీంపట్నం వేదిక కాబోతుందని తెలిపారు. దేశంలో కొన్ని ఒడుదొడుకుల వలన కమ్యూనిస్టులకు ఇబ్బంది జరిగిందని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోళ్ల(TRS Dharna over Paddy procurement) విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తెరాస ప్రభుత్వం చేస్తున్న ధర్నాను వ్యతిరేకించారు. మోదీ ప్రభుత్వం వరి ధాన్యం కొనడం లేదని ధర్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్... పోడు భూముల విషయంలో రైతులకు ఎందుకు న్యాయం చేయడంలేదని ప్రశ్నించారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని, మూడెకరాల భూమి దళితులకు ఇస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని తమ్మినేని అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కేసీఆర్‌కు మధ్య వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో మాటల యుద్ధం జరుగుతుంది తప్పా... రైతులకు పరిష్కారం లభించడం లేదని తెలిపారు. రైతులకు సీపీఎం అండగా ఉంటుందని... న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని తెలిపారు.