రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పహాడిషరీఫ్ ప్రాంతంలోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్లో జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, పురపాలక సిబ్బంది 36 గంటల్లో 50 పడకల సామర్థ్యమున్న తాత్కాలిక కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అన్ని సదుపాయాలతో కొవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు జీపీ కుమార్ తెలిపారు.
జల్పల్లిలో 36 గంటల్లో 50 పడకల కొవిడ్ చికిత్సా కేంద్రం - covid hospital in rangareddy district
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం వల్ల ఆస్పత్రిలో పడకలు సరిపోవడం లేదు. దీనికి పరిష్కారంగా రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని పహాడి షరీఫ్ ప్రాంతంలోని ప్రీమియర్ ఫంక్షన్ హాల్లో 50 పడకల సామర్థ్యమున్న తాత్కాలిక కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో.. వెయిటింగ్ స్థలం, అత్యవసర పరికరాలు, శానిటేషన్ డెస్క్, కౌన్సిలింగ్ రూమ్, రిజిస్ట్రేషన్ డెస్క్, పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఉచిత భోజన సదుపాయం కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశారు. ప్రతి బెడ్‌కు ఒక క్యాబిన్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక రూమ్, అన్ని బెడ్స్ క్యాబిన్ల మధ్య డ్యూటీ డాక్టర్లు, నర్సుల కోసం ప్రత్యేక సదుపాయాలతో ఓ సెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సహకారంతో దీనిని ఏర్పాటు చేసినట్లు జీపీ కుమార్ చెప్పారు. వైద్యంతో పాటు మందులు, భోజనం ఉచితంగా అందిస్తామని తెలిపారు.