రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో ఓ పిల్లాడు అందంగా ఉన్నాడని ముద్దు చేసిన ఐదుగురిని కరోనా వైరస్ తరుముతోంది. ఆ పిల్లాడి తల్లిదండ్రులు కరోనా వైరస్ బారినపడగా.. వైద్యబృందం నిర్వహించిన పరీక్షల్లో తొమ్మిది నెలల పిల్లాడికి కూడా వైరస్ సోకినట్లు బయటపడింది. అప్రమత్తమైన వైద్యబృందం చిన్నారికి దగ్గరగా ఉన్న వారి వివరాలు సేకరించింది. వారిలో ఐదుగురికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు.
కానిస్టేబుల్‌కు వైరస్
అలాగే మన్సురాబాద్ డివిజన్ శ్రీరామహిల్స్ కాలనీలో ఉంటున్న జియాగూడ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్‌కు వైరస్ సోకింది. అతని భార్య, ఇద్దరు పిల్లల్ని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న 13 మందిని బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలోని క్వారంటైన్ కేంద్రానికి పంపించారు.
ఒకే ఇంట్లో ఇద్దరికి కరోనా..
సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలో 5 కాలనీలు కంటైన్మెంట్ జోన్లుగా ఉండగా, సత్యనారాయణపురంలో ఒకే ఇంట్లో ఇద్దరికి కరోనా బయటపడింది. ఆ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక వనస్థలిపురం డివిజన్లో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు జిల్లా అధికారులు స్పష్టం చేశారు. గత నాలుగైదు రోజుల నుంచి కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న 4 ప్రాంతాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే ఎత్తివేయాలని భావిస్తున్నారు.
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతుండగా మిగతా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శివారు ప్రాంతాల్లో పెద్దగా దుకాణాలు తెరుచుకోలేదు. రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అటు వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోనూ కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చింది.
ఇదీ చూడండి :బీర్లను నేలపాలు చేసిన ఎక్సైజ్ పోలీసులు