తెలంగాణ

telangana

ETV Bharat / state

క్యాష్‌ బ్యాక్ ఆఫర్ చెల్లలేదని రూ.5 వేల జరిమానా

నెలవారీ బిల్లు చెల్లిస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తామని టాటా స్కై ప్రకటించింది. కానీ టాటా స్కై ఇచ్చిన వోచర్ వర్తించదని బిగ్ బాస్కెట్ తిరస్కరించింది. తదుపరి నెలలో ఆఫర్ వర్తిస్తుందని టాటా స్కై ప్రతినిధులు తెలిపారు. అలా వోచర్ కోసం నాలుగు నెలలు బిగ్ బాస్కెట్‌లో సుమారు 8 వేల రూపాయల సరకులు కొనుగోలు చేసినప్పటికీ.. ఆఫర్ మాత్రం దక్కలేదు. బిగ్ బాస్కెట్ షరతులు మారాయని.. తమ తప్పేమీ లేదని టాటా స్కై చివరకు వెల్లడించింది. వినియోగదారుల ఫోరం ఏం చెప్పింది.. తప్పెవరిది.. బాధ్యత ఎవరిదో చూద్దాం..

CONSUMER FORUM
CONSUMER FORUM

By

Published : Jul 29, 2020, 7:00 PM IST

నెలవారీ సబ్ స్క్రిప్షన్ చెల్లిస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తామని 2017లో టాటా స్కై ఓ పథకాన్ని తీసుకొచ్చింది. శంషాబాద్ ఆర్‌సీఐ ప్రాంతానికి చెందిన జితేందర్ జైన్ అనే వ్యక్తి 2017 అక్టోబరులో బిల్లు చెల్లించడంతో.. టాటా స్కై క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద రూ.600 విలువైన బిగ్ బాస్కెట్ వోచర్లను ఇచ్చింది. బిగ్ బాస్కెట్‌లో రూ.2వేలకు మించి సరకులు కొనుగోలు చేస్తే.. వోచర్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. తీరా రూ.2 వేల విలువైన సరకులు కొనుగోలు చేసిన తర్వాత.. ఆ వోచర్ చెల్లదని తేలింది. తదుపరి నెలలో ఆఫర్ ఇస్తామని టాటా స్కై కస్టమర్ కేర్ ప్రతినిధులు తెలిపారు. దీంతో నవంబరులో రూ.560 క్యాష్ బ్యాక్ వోచర్ కోసం.. రూ.4,407ల సరకులు.. డిసెంబరులో మరో రూ.2,136ల సరకులు బిగ్ బాస్కెట్‌లో కొనుగోలు చేశారు.

మా తప్పేమీ లేదు

కానీ ఒక్క నెలలో కూడా వోచర్ చెల్లలేదు. మా తప్పేమీ లేదని టాటా స్కై చెప్పడంతో జితేందర్ జైన్ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. జితేందర్‌కు ఆఫర్ కింద వోచర్ ఇచ్చింది వాస్తవమేనని.. తాము గోఫర్, బిగ్ బాస్కెట్ వంటి అనేక సంస్థలతో కలిసి ఈ పథకాన్ని కొంత కాలం అమలు చేసినట్లు టాటా స్కై వివరించింది. అయితే బిగ్ బాస్కెట్‌లో మొదటి సారి కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. షరతులు ముందే చూసుకోవాలని తెలిపింది. షరతులు మార్చినందుకు బిగ్ బాస్కెట్ దే బాధ్యత అని తమది కాదని వాదించింది.

వినియోగదారులను ప్రలోభపెట్టడమే

ఇరువైపుల వాదనలు విన్న రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం... టాటాస్కై తీరును తప్పు పట్టింది. టాటాస్కై ఇచ్చిన వోచర్ల కోసం వినియోగదారుడు సుమారు 8వేల రూపాయలు ఖర్చు చేశారని తెలిపింది. షరతుల వివరాలు వెల్లడించకుండా బిగ్ బాస్కెట్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవ్వడం.. వినియోగదారులను ప్రలోభపెట్టడమేనని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. టాటా స్కై క్యాష్ బ్యాక్ ఆఫర్ పేరిట ప్రలోభపెట్టి చెల్లని వోచర్లు ఇచ్చి వినియోగదారుడికి అనవసర ఖర్చు చేయించడమే కాకుండా.. మానసిక ఆందోళనకు కారణమైందని పేర్కొంది. వినియోగదారుడికి జరిమానా చెల్లించాల్సిందే కాబట్టి జితేందర్ జైన్‌కు 30 రోజుల్లో రూ.5 వేల జరిమానాతో పాటు ఖర్చుల కింద మరో రూ.2వేలు చెల్లించాలని టాటా స్కైని రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశించింది.

ఇది చదవండి:ఒకేసారి ఒక్కరితో గర్భం దాల్చాలని.. ఆ కవలల వింత కోరిక

ABOUT THE AUTHOR

...view details