Congress Party React on Moinabad Issue: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి. దిల్లీకి చెందిన వ్యక్తులు హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో చిక్కారు. తెరాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
మొయినాబాద్ ఘటన భాజపా, తెరాస కలిసి ఆడుతున్న నాటకంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక.. దానిని పక్కదారి పట్టించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి ఈ నాటకానికి తెరతీశాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో నలుగురు ఎమ్మెల్యేలను భాజపా వాళ్లు కొనుగోలు చేసేందుకు మంతనాలు జరుపుతున్నట్లు.. పోలీసులు వలపన్ని పట్టుకున్నట్టుగా పేర్కొనడం అంతా కూడా కట్టుకథని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆరోపించారు.
ఇందులో పోలీస్ అధికారులు కూడా భాగస్వామ్యం అయినట్టు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొదట నలుగురు ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయడంతో పాటు వారితో సంప్రదింపులు చేస్తున్న వారినీ అరెస్టు చేసి విచారించాలని వ్యాఖ్యానించారు.
అసలేం జరిగింది?.. తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: