పేదల బతుకులకు భరోసా కల్పించడానికి కాంగ్రెస్ హయాంలో భూములు పంచితే తెరాస ప్రభుత్వం వాటిని దౌర్జన్యంగా లాక్కొని ఔషధ కంపెనీలకు విక్రయిస్తూ దళారీగా మారిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఔషధనగరిని అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో ఔషధనగరి భూనిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కిసాన్‌సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత ఔషధనగరికి సేకరించే భూములను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
'ఔషధనగరిని అడ్డుకుంటాం.. నిర్వాసితులకు అండగా ఉంటాం' - రంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల పర్యటన
రంగారెడ్డి జిల్లా యాచారం కుర్మిద్ద గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఔషదనగరిని అడ్డుకుంటామని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి వెల్లడించారు. కుర్మిద్ద గ్రామంలో కాంగ్రెస్ నేతలు భట్టి, సీతక్క, జీవన్‌రెడ్డి తదితరులు పర్యటించారు. అక్కడి భూ నిర్వాసితుల తరఫున న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.

రైతులను భయపెట్టి భూములను లాక్కుంటున్నారని భట్టి ఆరోపించారు. రెండేళ్ల క్రితం అక్టోబరు 11న ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో పొరుగు ప్రాంతాల వారితో సభ నిర్వహించి ప్రజామోదం లభించినట్లు చెప్పుకొన్నారని..ఈ అక్టోబరు 11న అదే స్థలంలో రైతులంతా సమావేశమై ఔషధనగరికి భూములివ్వబోమని స్పష్టం చేయాలని పిలుపునిచ్చారు. కాలుష్యం వెలువడకుండా ఫార్మా కంపెనీల ఏర్పాటు సాధ్యం కాదని, ఇంటి స్థలాలిస్తామని ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తోందని ప్రజలెవరూ మోసపోవద్దన్నారు. వందెకరాల్లో ఫాంహౌజ్ నిర్మించుకున్న కేసీఆర్ పేదలకున్న ఎకరా, అరఎకరాను లాగేసుకుని రోడ్డున పడేస్తున్నారని సీతక్క, జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిర్వాసితులు, రైతుల తరఫున న్యాయపోరాటం చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఔషధనగరిని రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:కేసీఆర్‌తో దుబ్బాక ప్రజలకు నీటి కష్టాలు దూరం: హరీశ్