CM KCR Inaugurates Medha Railway Coach Factory : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన.. ఆసియాలోనే అతి పెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంకొల్లూర్‌లో రెండు పడక గదుల గృహ సముదాయం ప్రారంభోత్సవం అనంతరం.. రంగారెడ్డి జిల్లా కొండకల్ వెలిమల శివారులోని మేధా గ్రూప్ నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
CM KCR Speech at Medha Railway Coach Factory : సీఎస్ శాంతికుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీని లాంఛనంగా ప్రారంభించారు. రూ.1000 కోట్లతో దేశంలోనే పెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా నిర్మితమైన ఈ కర్మాగారాన్ని ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ పరిశీలించారు. ఇందులో యంత్రాల పని తీరును అక్కడి సిబ్బంది సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా అనంతరం అక్కడ నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
మేధా పరిశ్రమను చూసి గర్వపడుతున్నా :తెలంగాణ బిడ్డలు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేయనున్నారని... మేధా పరిశ్రమను చూసి గర్వపడుతున్నానని సీఎం కేసీఆర్‌అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. దీంతో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయని చెప్పారు. 15 రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే అనుమతులు వచ్చినట్టే భావించి పరిశ్రమ ప్రారంభించుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఫార్మా, పౌల్ట్రీ రంగాలు వర్ధిల్లుతున్నాయన్నారు.