CM KCR Integrated Rangareddy District Offices Complex తెలంగాణ ఉద్యమ సమయంలో తప్పుడు ప్రచారం చేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని అన్నారని గుర్తు చేశారు. విద్యుత్, సాగునీరు, తాగునీరు ఇవ్వని వాళ్లే తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. 15ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని వెల్లడించారు. ఏ ప్రాంతంలో మేధావులు, విద్యాధికులు, యువత ఏమరపాటుగా ఉంటారో అక్కడ చాలా బాధలు అనుభవించాల్సి వస్తుందని వివరించారు. అందుకు తెలంగాణ చరిత్రే ఉదాహరణ అని చెప్పారు.
చిన్న ఏమరపాటు వల్ల 58 ఏళ్లు తెలంగాణ కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని ఉద్ఘాటించారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఎక్కడా లేవని స్పష్టం చేశారు. దేశంలోని ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. రైతులు పండించే ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మరోసారి చెప్పారు. రైతులు అప్పులు తీసుకునే అవసరం లేకుండా రైతు బంధు ఎకరానికి రూ.10వేలు అందిస్తున్నామన్నారు.