తెలంగాణ

telangana

ETV Bharat / state

PRC: 'పీఆర్‌సీ'ని బేరానికి పెట్టిన క్లర్కులు.. కార్మికుల నుంచి వసూలు! - తెలంగాణ వార్తలు

పెరిగిన జీతం ఖాతాలో పడాలంటే.. చేయి తడపాల్సిందే. జీహెచ్‌ఎంసీలో సర్కిళ్ల వారీగా కార్మికులు, ఇతర ఉద్యోగులకు పలువురు క్లర్కులు విధించిన షరతు ఇది. పీఆర్‌సీ బిల్లులు ఆమోదించేందుకు సుదీర్ఘ ప్రక్రియ ఉంటుందంటూ ధరలు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. డబ్బు ఇవ్వకుంటే జీతాల ఫైళ్లను ఏదో మెలిక పెట్టి తిరస్కరిస్తున్నారు. చార్మినార్‌, శేరిలింగంపల్లి జోన్లలోని సర్కిళ్ల అధికారులపై ఈ తరహా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ సంఘాలు కల్పించుకున్నా క్లర్కులు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. చాలా సంవత్సరాలుగా పీఆర్‌సీ కోసం ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తుంటే.. లంచావతారులు వారి ఆశలను నీరుగార్చడం విమర్శలకు తావిస్తోంది.

clerks demand bribe, bribe for prc increasing
పీఆర్‌సీ కోసం క్లర్కుల వసూళ్లు, పీఆర్‌సీ పెరగడానికి వసూళ్లు

By

Published : Aug 16, 2021, 9:28 AM IST

జీహెచ్‌ఎంసీలో(GHMC) నాలుగో తరగతి ఉద్యోగి నుంచి అధికారి స్థాయి వరకు గ్రేడు ఆధారంగా పీఆర్‌సీ(PRC) కోసం లంచం ఇవ్వాల్సి వస్తోంది. గతంలో రూ.500ల నుంచి రూ.వెయ్యి తీసుకునేవారని.. ఇప్పుడు రూ.2వేల నుంచి రూ.5వేల వరకూ వసూలు చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఖైరతాబాద్‌ జోన్‌లోని జూబ్లిహిల్స్‌ సర్కిల్‌ క్లర్కు రూ.2వేలు ఇవ్వకపోతే జీతం తిరస్కరణకు గురవుతుందని బెదిరిస్తున్నట్లు పారిశుద్ధ్య విభాగం కార్మికులు 'ఈనాడు-ఈటీవీ భారత్‌'కు తెలిపారు. అబిడ్స్‌ సర్కిల్‌లోనూ ఇదే తరహా బెదిరింపులు సాగుతున్నాయి. తమ సర్కిల్‌లో డబ్బు ఇవ్వకుంటే విశ్రాంత ఉద్యోగుల పింఛన్ కూడా మంజూరవదని కార్మికులు వాపోయారు. శేరిలింగంపల్లి జోన్‌లోని అన్ని సర్కిళ్లలో రూ.5వేలు తీసుకుంటున్నారని, చార్మినార్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ జోన్లలో రూ.2వేల నుంచి రూ.3వేలు తీసుకుంటున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి, చార్మినార్‌ జోన్లలో 30శాతం మంది పీఆర్‌సీ బిల్లులను తిరస్కరించారని గుర్తుచేశారు. ఇలా వసూలు చేస్తున్న ముడుపులు.. క్లర్కులు, అకౌంట్స్‌ విభాగం, ఆడిట్‌ విభాగంలోని అధికారుల వరకు వెళ్తాయని సమాచారం.

పెండింగ్‌లో పెడుతున్నారు..

అకౌంట్స్‌ అధికారులు డబ్బు ఇవ్వనోళ్ల పీఆర్‌సీ బిల్లులను ఇంక్రిమెంట్లు పెండింగులో ఉన్నాయని, చార్జెజ్‌ పూర్తవలేదని, ఇతరత్రా కారణాలు చూపించి తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం.. సస్పెండ్‌ అయి తిరిగి విధుల్లో చేరినా, ఇంక్రిమెంట్లు తీసుకోకపోయినా.. 1-7-2018 తేదీ నాటికి గల బేసిక్‌ పే ఆధారంగా పీఆర్‌సీ ఇవ్వాలని స్పష్టం చేస్తోంది.

మాకూ తప్పట్లేదన్న అధికారులు..

కార్మికులు, కింది స్థాయి ఉద్యోగుల నుంచి కొందరు క్లర్కులు డబ్బు తీసుకుంటున్నారని ఖైరతాబాద్‌ జోన్‌లోని సర్కిల్‌ కమిషనర్లను వివరణ కోరగా.. మాకూ అదే సమస్య ఉందని వాపోవడం గమనార్హం. మున్సిపల్‌శాఖలో రూ.20వేలు ఇచ్చి బిల్లులు ఆమోదింపజేసుకున్నామని వాపోయారు. కొందరు సర్కిల్‌ కమిషనర్లు.. వారి కింద పనిచేసే ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, సహాయ మున్సిపల్‌ కమిషనర్లతో ఆ డబ్బు కట్టించినట్లు తెలిపారు. ఏమైనా.. కార్మికులకు ఇబ్బంది కలగకుండా విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. అందరికీ ఈ నెలలో పెరిగిన జీతాలను అందజేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:తీగ లాగితే కదిలిన 'సన్‌పరివార్‌' బాగోతం.. కానీ గోప్యంగానే కేసు.. ఏం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details