Ramanuja sahasrabdi: సమతామూర్తి సహస్త్రాబ్ది ఉత్సవాల్లో అమెరికా నుంచి వచ్చిన 8 మంది చిన్నారులు తమ మేథస్సుతో వేలాది మంది భక్తులను ముగ్దులను చేశారు. ప్రవచన మండపంలో త్రిదండి చినజీయర్ స్వామి సమక్షంలో 700 శ్లోకాలున్న భగవద్గీతను అవధానం చేసి సహస్రాాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అవలీలగా సమాధానం చెప్పేస్తారు..
అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది చిన్నారులు... ప్రజ్ఞ సంస్థ ద్వారా మూడేళ్లుగా భగవద్గీతలోని శ్లోకాలను సంపూర్ణంగా నేర్చుకున్నారు. ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరై భగవద్గీత శ్లోకాలను ఆసాంతం ఔపోసన పట్టారు. రామానుజచార్యుల ఉత్సవాల్లో భాగంగా ప్రవచన మండపంలో భగవద్గీతపై భక్తులు అడిగిన ప్రశ్నలకు కంప్యూటర్ కంటే వేగంగా సమాధానమిచ్చి చినజీయర్ స్వామినే ఆశ్చర్యపోయేలా చేశారు. చినజీయర్ స్వామి కూడా చిన్నారుల ప్రతిభను పరీక్షించి ముగ్ధులయ్యారు. భగవద్గీతలో ఏ శ్లోకం ఏ అధ్యాయంలో ఉంది? పలానా అక్షరంతో మొదలయ్యే శ్లోకం ఏ అధ్యాయంలో వస్తుంది? పలానా శ్లోకం ఏ అధ్యాయంలో ఎన్నో భాగంలో ఉంది? ఒక అధ్యాయంలో మూడో శ్లోకం తీసేస్తే దాని ముందు వచ్చే శ్లోకం ఏంటి? అనే క్లిష్టమైన ప్రశ్నలకు అమెరికా చిన్నారులు అవలీలగా సమాధానాలిచ్చి ప్రవచన మండపాన్ని మారుమోగేలా చేశారు.