MP Ranjith Reddy Facebook Account Hacked : బీఆర్ఎస్ నేత, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.రంజిత్ రెడ్డి ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయింది. సైబర్ కేటుగాళ్లు ఎంపీ ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆదివారం రాత్రి గుర్తించిన రంజిత్ రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. తన పేరుతో వచ్చే పోస్టులకు, మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని ట్విటర్ వేదికగా సూచించారు. ఈ మేరకు ఎంపీ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేశారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంపీ ఖాతాను హ్యాక్ చేసింది నైజీరియా లేదా ఈజిప్టుకు చెందిన కేటుగాళ్ల పనిగా పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే తమ విచారణ సాగిస్తున్నారు.
ఎవ్వరినీ వదలడం లేదు..: పెరుగుతోన్న సాంకేతికతను వినియోగించుకుంటూ సైబర్ కేటుగాళ్లు నిరక్ష్యరాస్యులు, అమాయకుల దగ్గరి నుంచి విద్యావంతులు, ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు, నేతల వరకు ఎవరినీ వదలడం లేదు. అవకాశం దొరికిందా వల వేస్తున్నారు.. పొరపాటున చిక్కామా ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. మనం తేరుకునేలోపే చేయాల్సిందంతా చేసి.. ఛటుక్కున మాయమైపోతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా.. అన్నీ తెలిసి ఎంతో అప్రమత్తంగా ఉంటున్నా కంటికి కనిపించని ఈ మాయగాళ్లు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తున్నారు.
ఆ సత్యాన్ని గ్రహించే వరకు ఇంతే..: ఇలాంటి ఎన్నో ముఠాలను మన ఖాకీలు కటకటాల్లోకి నెడుతున్నా.. మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా రోజుకో కొత్త అవతారంలో మన ముందుకు వస్తున్నారు. మన బలహీనతలను ఆసరాగా చేసుకుంటూ.. వారి బలాలను వినియోగించుకుంటూ ఎంతో మందిని బురిడీ కొట్టిస్తున్నారు. క్షణాల్లో ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును కనికరం లేకుండా మాయం చేస్తున్నారు. కష్టపడందే ఏదీ రాదనే సత్యాన్ని, ఊరికే వచ్చే ప్రతీదీ ఓ ఊహించని ప్రమాదాన్ని తీసుకొస్తుందనే నిజాన్ని ప్రజలంతా గుర్తించేంత వరకు ఇలాంటి 'ముసుగు మోసగాళ్లు' పుట్టుకొస్తూనే ఉంటారు. మోసపోవడానికి రెడీగా ఉన్నవాళ్లను మోసం చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి వాటి పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటే.. మనం అంత సేఫ్‌గా, ప్రశాంతంగా ఉండొచ్చు అనేది నిపుణులు నిత్యం చెబుతున్న, ప్రభుత్వాలు పదే పదే వినిపిస్తోన్న మాట.