తెలంగాణ

telangana

ETV Bharat / state

KISHAN REDDY: 'భాజపాపై కేసీఆర్‌, కేటీఆర్‌ విష ప్రచారం చేస్తున్నారు' - తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ

KISHAN REDDY: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద రేపు జరగనున్న బహిరంగ సభకు భాజపా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నేతలు ఈటల రాజేందర్‌ సహా పలువురు నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తెరాస సర్కార్​పై కిషన్​రెడ్డి నిప్పులు చెరిగారు.

KISHAN REDDY: 'భాజపాపై కేసీఆర్‌, కేటీఆర్‌ విష ప్రచారం చేస్తున్నారు'
KISHAN REDDY: 'భాజపాపై కేసీఆర్‌, కేటీఆర్‌ విష ప్రచారం చేస్తున్నారు'

By

Published : May 13, 2022, 1:40 PM IST

Updated : May 13, 2022, 3:53 PM IST

KISHAN REDDY: 'భాజపాపై కేసీఆర్‌, కేటీఆర్‌ విష ప్రచారం చేస్తున్నారు'

KISHAN REDDY: రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ సర్కార్‌కు సమాధి కట్టి.. ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని భాజపా ఏర్పాటు చేయనుందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద రేపు జరగనున్న బహిరంగ సభకు భాజపా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభకు హాజరు కానున్నందున.. భారీ ఎత్తున జన సమీకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నేతలు ఈటల రాజేందర్‌ సహా పలువురు నాయకులు తుక్కుగూడ వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కేంద్రంపై తప్పుడు ప్రచారంతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. భాజపాపై విషం కక్కుతూ.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెరాస ప్రభుత్వంలోనే అనేక వైఫల్యాలున్నాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్​ పాలన పేరు గొప్ప.. ఊరు దిబ్బగా మారిందని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజం ఆయనను చీదరించుకుంటుందన్న ఆయన.. పార్లమెంట్, హుజూరాబాద్, దుబ్బాకల్లో తెరాసపై ఉన్న వ్యతిరేకత బయటపడిందన్నారు. ప్రజలను ఎవరూ ఎక్కువ రోజులు మోసం చేయలేరన్నారు.

కాంగ్రెస్​కే డిక్లరేషన్ లేదు.. రైతులకు ఏం చేస్తారు..: భాజపా యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ప్రజా వ్యతిరేకత, అవినీతి, నియంతృత్వ పాలనపై అమిత్ షా ప్రసంగం ఉండబోతోందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పైనా కిషన్​రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్​కే డిక్లరేషన్ లేదు.. వాళ్లు రైతులకు ఏం డిక్లరేషన్ చేస్తారంటూ దుయ్యబట్టారు.

టెంట్ సిటీ ఏర్పాటు..: ఇతర దేశాల కంటే ఉత్తమ ఆర్థిక వ్యవస్థతో దేశాన్ని నడిపిస్తోంది మోదీ ప్రభుత్వమని కిషన్​రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగానే జీ 20 దేశాల కాన్ఫరెన్స్​కు భారతదేశం వేదిక కాబోతోందన్న ఆయన.. అందుకోసం టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.

భాజపాపై కేసీఆర్‌, కేటీఆర్‌ విష ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌ తప్పుడు ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాం. రాష్ట్రంలోని ధాన్యమంతా కొనుగోలు చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్​.. ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ సర్కార్‌కు సమాధి కడతాం.-కిషన్​రెడ్డి, కేంద్ర మంత్రి

కేసీఆర్​ను గద్దె దింపడమే లక్ష్యంగా..: కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పలుచబడి.. ప్రజల విశ్వాసం కోల్పోయిందని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి.. అణచివేత, కక్షపూరిత పద్ధతిలో కేసీఆర్‌ రాజ్యం పాలించాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను చైతన్యవంతం చేస్తూ.. కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టారన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఏర్పాట్లను కిషన్​రెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఈటల పరిశీలించారు. రేపు అమిత్‌ షా హాజరయ్యే బహిరంగ సభ విజయవంతం కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి..

'కేసీఆర్​పై ప్రజలకు నమ్మకం పోయింది.. అందుకే ప్రతిపక్షాలపై బురద'

'ఒక్క అవకాశమివ్వండి.. డబుల్ ఇంజిన్ సర్కార్​తోనే రాష్ట్ర అభివృద్ధి'

Last Updated : May 13, 2022, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details