తెలంగాణ

telangana

ETV Bharat / state

'మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ పెద్ద డ్రామాకు తెరలేపారు' - Sama Ranga Reddy Latest News

భాజపాకు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదని.. పార్టీ సిద్దాంతాలు నచ్చిన వారు స్వయంగా పార్టీలోకి వస్తారని భాజపా రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి తెలిపారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారంటూ విమర్శించారు. భాజపాపై తెరాస చేస్తున్న ఆరోపణలను వ్యతిరేకిస్తూ హస్తినాపురం చౌరస్తాలో సామ రంగారెడ్డి నిరసన చేపట్టారు.

bjp leaders protest at lb nagar
bjp leaders protest at lb nagar

By

Published : Oct 27, 2022, 9:58 PM IST

Updated : Oct 27, 2022, 11:04 PM IST

మునుగోడులో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ పెద్ద డ్రామాకు తెరలేపారని భాజపా రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. భాజపాపై తెరాస చేస్తున్న ఆరోపణలను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా హస్తినాపురం చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మునుగోడులో ఓటమి భయంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు తెరాస ప్రభుత్వం చూస్తోందని సామ రంగారెడ్డి విమర్శించారు. అందుకే భాజపా నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు బేరాలు చేసిందంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

భాజపాకు ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదని.. పార్టీ సిద్దాంతాలు నచ్చిన వారు స్వయంగా పార్టీలోకి వస్తారని సామ రంగారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్​లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను తెరాస కొనుక్కుని వారికి మంత్రి పదవులు ఇచ్చిందని.. ఆ రంగును భాజపాకు పూసే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. ఏదేమైనా మునుగోడులో భాజపా గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పలువురు భాజపా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

'మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ పెద్ద డ్రామాకు తెరలేపారు'
Last Updated : Oct 27, 2022, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details