BJP Chief JP Nadda Attends BJP Public Meeting at Chevella : ప్రాంతీయ పార్టీల్లో ఎప్పుడూ వారి వారసులే పదవుల్లో ఉంటారని.. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడం గురించే ఆలోచిస్తుంటారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) అన్నారు. చేవెళ్లలో జరిగిన బీజేపీ బహిరంగ సభ(BJP Public Meeting)లో పాల్గొన్న ఆయన.. బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దేశం గురించి, ప్రజల గురించి ఈ ప్రాంతీయ పార్టీలు ఆలోచించవని జేపీ నడ్డా తెలిపారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్మును భారీగా దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్(BRS) అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితిగా మారిందని విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. వేలాది మంది బలిదానాల వల్ల తెలంగాణ సాకారమైందని.. వారి బలిదానాలను కేసీఆర్ కుటుంబం వృథా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీకి మీరు వేసే ఓటు - తెలంగాణ, దేశ భవిష్యత్తును మారుస్తుంది : అమిత్ షా
JP Nadda Election Campaign in Telangana : రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఈ పదేళ్ల కాలంలో తన కుటుంబీకులకే పదవులు ఇచ్చి యువతను పూర్తిగా మోసం చేశారని జేపీ నడ్డా ధ్వజమెత్తారు. ఓట్ల కోసం ముస్లిం రిజర్వేషన్లు పెంచి హిందువులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. రూ.1.20 లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మించి కమీషన్లు దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ తొమ్మిదేళ్లలో ఎంతమందికి రెండుపడక గదుల ఇళ్లు ఇచ్చారో ఆలోచించాలని జేడీ నడ్డా సభకు వచ్చిన ఓటర్లను ప్రశ్నించారు.