Bhatti Vikramarka Fires on State Government : కేసీఆర్ ప్రభుత్వం అసైన్డ్ భూములు కూడా లాగేసుకుంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మంత్రి కేటీఆర్ కార్పొరేట్ కంపెనీల కోసమే పని చేస్తున్నారని.. ఆయన తనకు పరిచయమున్న ఎంఎన్‌సీ కంపెనీలకు భూములు పంచుతున్నారని విమర్శించారు. ఓఆర్‌ఆర్ విషయంలో సోమేశ్ కుమార్, అర్వింద్‌కుమార్ కేటీఆర్ ముందుకు ప్రతిపాదన తీసుకెళ్లారని అన్నారు. బ్యూరోక్రాట్లు ప్రజల కోసం పని చేయాలి కానీ.. కార్పొరేట్ల కోసం కాదని భట్టి విక్రమార్క హితవు పలికారు.
ప్రభుత్వం 30 ఏళ్లు టోల్ వసూలు చేసేందుకు.. అధికారం ఎవరైనా ఇస్తారా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అందిన కాడికి దోచుకునే దుర్మార్గ పరిపాలన సాగుతోందని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలని అన్నారు. కానీ సోమేశ్ కుమార్ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా ప్రభుత్వ అడ్వయిజర్‌గా నియమించారని ఆక్షేపించారు. రిటైర్డ్ అయిన ఐఎస్‌ఎస్, ఐపీఎస్‌లను ఎందుకు నియమిస్తున్నారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
మళ్లీ దోపిడీ ప్రారంభించినట్లే : వీళ్లపై చాలా అపోహలు అనుమానాలున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. భూభకాసురులు భూములు ఆక్రమించుకునేందుకు సోమేశ్ కుమార్ సహాయపడ్డారని ఆరోపించారు. ఆయనను సలహాదారుగా నియమించారంటే మళ్లీ దోపిడీ ప్రారంభించినట్లేనని స్పష్టం చేశారు. సలహాదారు పదవిని రద్దు చేసి సోమేశ్ కుమార్‌పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ధరణితో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు
విలువైన భూములను లాక్కునే ప్లాన్‌లోనే : ధరణి పేరు చెప్పి కాంగ్రెస్ ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.25 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్లాన్‌లోనే.. సూత్రధారి సోమేశ్ కుమార్‌ను మళ్లీ సలహాదారుగా నియమించుకున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే రూ. 5లక్షల కోట్ల విలువైన భూములను గుంజుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఇందిరా గాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.