Bhatti Vikramarka on Lakshmi Devi Palli Project : తెలంగాణ శాసన సభపక్ష నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర ఇవాళ రంగారెడ్డిలో సాగింది. ప్రజలను కలుసుకుంటూ ఆయన పాదయాత్ర కొనసాగించారు. అనంతరం లక్షీదేవి పల్లి సభలో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. దశాబ్దాలు గడుస్తున్నా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం కావడం లేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించే పెద్దలకి చేయాలనే సంకల్పం లేకపోవడం వలనే.. నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు. ప్రజల అవసరాల కోసం కాంగ్రెస్ హయంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, కల్వకుర్తి ప్రాజెక్టులు నిర్మించినట్లు గుర్తు చేశారు.
ప్రాణహిత చేవెళ్లను చంపి సీఎం కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారని భట్టి విక్రమార్క ఆరోపించారు. కాళేశ్వరం గోదావరి నది మీద కట్టిన చెక్ డ్యామ్ మాత్రమేనని అన్నారు. దాని వల్ల ఒక్క ఎకరాకు నీరు అందలేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం కమీషన్లు కేసీఆర్ సర్కార్ దండుకుందని విమర్శించారు. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టుకు జూరాల నుంచి సాగు నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కృష్ణ నది నుంచి ఒక్క చుక్క కూడా పాలమూరుకు నీరందలేదని ఆరోపించారు. లక్షీదేవి పల్లి ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదని భట్టి ధ్వజమెత్తారు. ఈ ఏడాది చివర్లో అధికారంలోకి రాగానే పాలమూరు రంగారెడ్డితో పాటు లక్ష్మీదేవి రిజర్వాయర్ పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్నా... ఇంకా కృష్ణా జలాల్లో మన వాటాను తేల్చుకోలేకపోయారని భట్టి ఎద్దేవా చేశారు.