Bhatti Vikramarka Padayatra news : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 52వ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్ర ఇవాళ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో కొనసాగుతోంది. దారి పొడువున ప్రజలు నీరాజనం పట్టగా.. మరికొందరు వారి సమస్యలను భట్టికి వివరించారు. ప్రజా సమస్యలు తెలుసుకున్న భట్టి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Bhatti Vikramarka on Congress Public Meeting : పెద్దఅంబర్ పేట్ కూడలి వద్ద కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, వి. హనుమంత రావు, జగ్గారెడ్డి తదితర ముఖ్యనేతలతో కలిసి భట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. తెలంగాణలో యువత తీవ్ర ఆవేదనలో ఉందని అన్నారు. నిరాశలో ఉన్న యువతుకు భరోసా ఇచ్చేందుకే సరూర్నగర్లో సోమవారం కాంగ్రెస్ నిరుద్యోగ భరోసా సభను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సభలో పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు.
నిరుద్యోగుల కోసం తమ పార్టీ కార్యాచరణను సభలో వివరిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు కచ్చితంగా న్యాయం జరగాలని అన్నారు.
గతంలో తమ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. దాదాపు 10 వేల ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం పరిధిలోనే రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.25 లక్షల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం వెనుక్కి తీసుకొందని ఆరోపణలు చేశారు.