Krishna Ella at NARM: సాధారణంగా జంతువుల్లో ఏదైనా టీకా సమర్థత, నిరూపణ కావడం వ్యాక్సిన్ అభివృద్ధిలో చాలా కీలకమని.. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నార్మ్ ఎంఎస్ స్వామినాథన్ ఆడిటోరియంలో.. "జంతు నమూనాలు - సవాళ్లు, భవిష్యత్తు దృక్పథాలు" అనే అంశంపై 10వ అంతర్జాతీయ సదస్సులో కృష్ణ ఎల్ల పాల్గొన్నారు. 3 రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు... తొలి రోజు సీపీసీఎస్ఈఏ(CPCSEA) ఛైర్మన్ డాక్టర్ ఓపీ చౌదరి... సహా పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లకు... డాక్టర్ ఓపీ చౌదరి చేతుల మీదుగా జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.
జన్యువుల్లో తేడాలు కనిపెట్టడం ద్వారా.. మన సొంత జంతు నమూనాలు అభివృద్ధి చేయవచ్చునని.. డాక్టర్ కృష్ణ ఎల్ల సూచించారు. దేశంలో గొప్ప నైపుణ్యం, నిపుణత ఉన్న దృష్ట్యా.. శాస్త్రవేత్తలు కూడా మైలురాళ్లు అధిగమించడంపై ప్రత్యేకమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని... కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. విప్లవాత్మక పర్యావరణ మార్పుల నేపథ్యంలో జంతు క్రమం విశ్లేషణ చాలా సులభమని వెల్లడించారు.