విదేశాల్లో డిమాండు ఉండి ఎగుమతికి అవకాశమున్న పంటలను మనదేశంలో అధికంగా పండించాలని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల(Krishna Ella) సూచించారు. ఉదాహరణకు దానిమ్మ, జామ పండ్లను అమెరికా, ఐరోపా ప్రజలు తింటారని, ఇలాంటివాటిని ఎక్కువగా పండిస్తే ఎగుమతులు పెరుగుతాయన్నారు. అలాగే పంటలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి అధిక ఆదాయం పొందే మార్కెటింగ్ మెలకువలు పెంచుకోవడం అవసరమని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ‘జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ’ (నార్మ్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
- వ్యవసాయ డిగ్రీ అనేది బహుళ లక్ష్యాలున్న డిగ్రీ. పట్టా ఉంటే సరిపోదు, నైపుణ్యం ఉండాలి. అమెరికా, చైనాల్లో సైన్స్ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యం ఉంది. మన విద్యార్థులకు మంచి పరిజ్ఞానం ఉంది. కానీ నైపుణ్యం తక్కువ. ఐటీ, పోలీసు, ఐఏఎస్ సర్వీసుల్లోనూ ఎక్కువ మంది వ్యవసాయ పట్టభద్రులున్నారు.
- ప్రపంచ జనాభా పెరుగుతోంది. ఆహార కొరత ఏర్పడుతోంది. ఆవిష్కరణల్లో భారత్ 48వ ర్యాంకులో ఉంది. రాబోయే 10 ఏళ్లలో ఆవిష్కరణలు చేసే వారే అభివృద్ధి చెందుతారు. భారతీయ కుటుంబాలు పిల్లలకు విద్య, ఉద్యోగం ముఖ్యం అంటున్నాయి. కానీ ఇన్నోవేషన్స్ వైపు వారిని మళ్లించాలి.
- మనదేశంలో పంటల దిగుబడులు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. ఉదాహరణకు ధాన్యం దిగుబడిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. కానీ ఉత్పాదకత (ఎకరానికి ఎంత పండుతోంది?) అనే విషయంలో 54వ ర్యాంకులో ఉన్నాం.
- వంటనూనెలు మనదేశంలో తక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు కొబ్బరి నూనె మంచిది కాదని హార్వర్డ్ వర్సిటీ కూడా చెప్పింది. దానిని నిత్యం వంటల్లో వాడే కేరళ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అది మంచిదని ఐరోపా కూడా చెబుతోంది. మునక్కాయలు అద్భుత ఆహారమని అమెరికా, ఐరోపాల్లో చెబుతున్నారు. గోంగూర పచ్చడి రక్తపోటును తగ్గిస్తుంది. వీటి చుట్టూ సైన్స్ పెరగలేదు. అశ్వగంధను అమెరికా ఎప్పుడూ పెంచలేదు. కానీ అశ్వగంధ ఉత్పత్తులను అమెరికాలోని మిడ్ వెస్ట్ రాష్ట్రాలు ఎగుమతి చేస్తున్నాయి.
- కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. ఆ జిల్లాలో పాడి, పంటలతో మిశ్రమ సేద్యం చేయడమే అందుకు కారణం. అవి లేని ఇతర జిల్లాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
- మన పంటల దిగుబడిలో 20 శాతాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ఇక్కడ కూడా ధరలు పెరిగి రైతులకు అధిక ఆదాయం వస్తుంది.
శాస్త్రీయ ఆధారాలతోనే కొత్త బ్రాండ్లు
ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర మాట్లాడుతూ ‘ఆధునిక ఇన్నోవేటివ్ ఇండియా’కు భారత్ బయోటెక్(Krishna Ella) ఉదాహరణ అన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమలు ఉంటే విలువ ఆధారిత ఉత్పత్తులు వస్తాయని పేర్కొన్నారు. అంతకుముందు ఆన్‌లైన్ ద్వారా పలువురికి పురస్కారాలను ప్రదానం చేశారు. నార్మ్ సంచాలకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.