ఆహార భద్రత, అన్నదాతలకు అండ, వినియోగదారులకు మేలు, మార్కెటింగ్ స్థిరత్వంతో అద్భుతాలను సాధించే అవకాశం ఉన్న ఆహారశుద్ధి రంగానికి రాష్ట్రంలో అవరోధాలు తప్పడం లేదు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో మంచి పురోగతి సాధిస్తున్నా... వాటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో ఆశించిన ప్రగతి లేదు. రాయితీలు, ఎగుమతులు, నిల్వ, రవాణా తదితర అంశాల్లోనూ ఆటంకాలున్నాయి. ప్రత్యేక యంత్రాంగం లేక పరిశ్రమలకు సంబంధించిన దస్త్రాలు శాఖల మధ్య తిరుగుతున్నాయి. గత రెండేళ్లుగా కరోనాతో ఈ రంగం దెబ్బతినగా, రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన కొత్త విధానంతో ఆశలు చిగురిస్తున్నాయి.
నిదానంగా పయనం
పసుపు, నారింజ ఉత్పత్తుల్లో రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంది. నిమ్మ, ద్రాక్ష, మామిడి, సోయాబీన్, పాల ఉత్పత్తుల్లో మెరుగ్గా ఉంది. కోళ్ల పరిశ్రమ, విత్తనోత్పత్తిలో అగ్రభాగాన కొనసాగుతోంది. రాష్ట్రప్రభుత్వ పారిశ్రామిక విధానంలో ఆహారశుద్ధిని 14 ప్రధాన రంగాల్లో ఒకటిగా ఎంపిక చేసింది. ఈ పరిశ్రమలకు 2017లో రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేసేలా మరో రూ.పదివేల కోట్ల పెట్టుబడులు, 1.25 లక్షల మందికి ఉపాధి లక్ష్యాలుగా పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు మెగా పార్కులుండగా, కొత్తగా రెండు పారిశ్రామిక పార్కులు ఏర్పాటయ్యాయి. ఏడు సమీకృత శీతల నిల్వ ప్రాజెక్టులు, కేంద్ర పథకం కింద 20 ప్రాజెక్టులు మొదలయ్యాయి. 15 వేల సూక్ష్మ, 1750 చిన్నతరహా, 240 మధ్యతరహా, భారీ పరిశ్రమలున్నాయి.
ఆశించిన పురోగతి లేదు
గత ఆరేళ్లలో 2341 పరిశ్రమలు మాత్రమే ఏర్పాటయ్యాయి. 47,411 మందికి ఉపాధి లభించింది. మొత్తంగా పెట్టుబడులు రూ.మూడు వేల కోట్ల లోపే. రాష్ట్రంలో వనరులతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. మొత్తం 30 వేలకు పైగా పరిశ్రమలకు వీలుంది. పెట్టుబడులు, ఎగుమతుల్లోనూ రాష్ట్రం ఆశించినంతగా పురోగమించడం లేదు. పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్) అమల్లోకి తెచ్చినా, ఆహారశుద్ధి పరిశ్రమలు పెద్దగా రాలేదు. వార్షిక ఎగుమతులు రూ. వెయ్యి కోట్లకు చేరడం లేదు. మూడేళ్లుగా సాగునీటి సదుపాయాలు పెరగడంతో వ్యవసాయోత్పత్తుల్లో భారీగా వృద్ధి ఉన్నా, ఈ విషయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోవడంతో పెట్టుబడిదారులను ఆకర్షించలేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఎన్నో సమస్యలు
రాష్ట్రంలో ఆహారశుద్ధికి ప్రత్యేక విధానం ఆలస్యంగా అమల్లోకి వచ్చింది. 2017లో ప్రోత్సాహకాలు ప్రకటించినా, దాని అమలుకు ఉత్తర్వులు రాలేదు. వ్యవసాయశాఖ పరిధిలో ఉన్న ఆహారశుద్ధి అంశాన్ని రాష్ట్రం ఏర్పడ్డాక, పరిశ్రమల శాఖకు బదలాయించారు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు సైతం ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ శాఖల మధ్య సమన్వయలోపం కనిపిస్తోంది. ఈ పరిశ్రమలను జనావాస ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సమస్యలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గిడ్డంగులను భారీగా నిర్మించినా, అందులో శీతల గిడ్డంగులు లేవు. మొత్తం అయిదువేలకు పైగా శీతల గిడ్డంగుల అవసరం ఉండగా, ప్రస్తుతం 389 మాత్రమే ప్రైవేటు రంగంలో ఉన్నాయి. పంజాబ్‌లో ప్రభుత్వ రంగంలోనే వీటి సంఖ్య రెండువేలు. రాష్ట్రంలోని మార్కెట్‌యార్డుల్లోనూ శీతల గిడ్డంగుల ఊసే లేదు.
శుద్ధికి అన్నీ సమస్యలే...
ఆహారశుద్ధికి యంత్రాలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి. శిక్షణ సదుపాయం కూడా రాష్ట్రంలో ప్రారంభం కాలేదు. టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. ఎగుమతుల మండలిని స్థానికంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు పథకాలు, రాయితీలు వేర్వేరుగా ఉన్నాయి. ఏ పథకం కింద ఏర్పాటు చేస్తే ఆ రాయితీలు మాత్రమే వర్తిస్తాయి. రాయితీల మంజూరు, విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇలా పారిశ్రామికవేత్తలకు కేంద్రం నుంచి రూ. 800 కోట్లు, రాష్ట్రం నుంచి రూ. 291 కోట్ల మేర రావాల్సి ఉంది.
కొత్త విధానంపై కోటి ఆశలు
ఆహారశుద్ధికి ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ గత నెలలో ప్రకటించారు. కొత్త విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర కూడా వేసింది. 2024-25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో కొత్త మండళ్ల స్థాపనకు కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించింది. పారిశ్రామికులకు విద్యుత్తు, పెట్టుబడులు, జీఎస్టీ, ఉపాధి కల్పన రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించింది. ఆహారశుద్ధి మండళ్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ధి చేసి దరఖాస్తుదారులకు భూమిని కేటాయించాలని నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతుల కోసం ఏర్పాటు చేసే నాణ్యమైన యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. కొత్త విధానం కింద పరిశ్రమల స్థాపనకు వెయ్యి మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. పలు బహుళజాతి సంస్థలు సైతం పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి.
సులువైన విధానాలుండాలి